చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కేంద్ర బృందం విస్తృత పర్యటన అధికారుల ఎదుట అన్నదాతల ఆవేదన.. ప్రశ్నల వర్షం కర్ణాటక తరహాలో కిలోకు రూ.18 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ రైతు పేరుతో పల్ప్ తయారీ.. వేర్‌హౌస్ రసీదులపై బ్యాంక్ రుణాల కోసం వినతి
కాణిపాకం:ఏటా కష్టాలు.. ఏటా నష్టాలు.. దళారుల దోపిడీకి అడ్డూ అదుపూ లేదు.. పాలకుల హామీలకు ఆచరణ లేదు.. ఇదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతు దయనీయ స్థితి. ఈ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నియమించిన ఒక ప్రత్యేక ఉన్నతాధికారుల బృందం గురు, శుక్రవారాల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించింది. అయితే, క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన ఈ కమిటీ సభ్యుల తీరుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటక తరహా పాలసీ కావాలి
ప్రాంతీయ మార్కెట్లలో ధరల స్థిరీకరణ లేకపోవడంతో తాము నట్టేట మునుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం మామిడి రైతులకు అండగా నిలుస్తూ కిలోకు రూ.18 చొప్పున ధర కల్పించిందని, అదే తరహా విధానాన్ని తక్షణమే ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేసి చిత్తూరు, తిరుపతి జిల్లాల రైతులకు న్యాయం చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు.
వినూత్న ప్రతిపాదనలు.. బ్యాంకింగ్ లింకేజీ
కేవలం తాత్కాలిక ఉపశమనాలు కాకుండా, తమకు శాశ్వత ఆర్థిక భరోసా కల్పించేలా రైతులు కొన్ని కీలకమైన వినూత్న ప్రతిపాదనలను కేంద్ర బృందం ముందుంచారు. పళ్లగుజ్జు పరిశ్రమలకు వెళ్లే మామిడి కాయలను వ్యాపారుల అజమాయిషీలో కాకుండా, నేరుగా రైతు పేరు మీదే పల్ప్‌గా మార్చేలా నిబంధనలు తీసుకురావాలి. ఆ విధంగా తయారైన పల్ప్‌ను సెంట్రల్ వేర్‌హౌస్ రిసిప్ట్ ఫైనాన్స్ పరిధిలోకి తీసుకువచ్చి భద్రపరచాలి. మార్కెట్‌లో రేట్లు తక్కువగా ఉన్నప్పుడు రైతులు నష్టపోకుండా ఉండేందుకు, ఆ వేర్‌హౌస్ రసీదుల ఆధారంగా బ్యాంకుల ద్వారా రైతులకు సులభంగా రుణాలు మంజూరు చేసే సరికొత్త విధానాన్ని అమల్లోకి తేవాలని స్పష్టం చేశారు.
ఊరటనిచ్చేనా ఈ పర్యటన?
మార్కెట్‌లో ధరలు పడిపోయిన సమయంలో అత్యవసర ఖర్చుల కోసం రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకోకుండా.. ఈ బ్యాంక్ రుణాల విధానం ఎంతగానో దోహదపడుతుందని నిపుణు లు సైతం అభిప్రాయపడుతున్నారు. ధరలు అనుకూలంగా ఉన్నప్పుడు పల్ప్‌ను అమ్ముకుని రైతులు లబ్ధి పొందే వీలుంటుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లక్షలాది మంది రైతుల జీవనాధారమైన మామిడి సాగును సంక్షోభం నుంచి గట్టెక్కించేలా.. కేంద్ర బృందం తన నివేదికలో ఈ డిమాండ్లను పొందుపరిచి, కేంద్రానికి సిఫార్సు చేయాలని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.


