అక్రమ వసూళ్లు చేస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

అక్రమ వసూళ్లు చేస్తే కఠిన చర్యలు

Jul 11 2026 12:42 AM | Updated on Jul 11 2026 12:42 AM

● డీఆర్‌డీఏ కార్యాలయంలో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు ● ఫిర్యాదులకు 9390505066 నంబర్‌ను సంప్రదించండి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు బ్యాంకు రుణాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇటీవల మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాలు, బ్యాంకు లింకేజీలు, సీ్త్ర నిధి, సీఐఎఫ్‌, వడ్డీ లేని రుణాలు, జీవనోపాధి యూనిట్లు మంజూరు చేయిస్తామని నమ్మబలికి కొందరు అక్రమంగా నగదు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు పథకంలో స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల పెంపుదల లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. సంఘాల్లోని మహిళలకు వారి అర్హతను బట్టి ప్రత్యేక ప్రభుత్వ వ్యవస్థ ద్వారానే రుణాలు పారదర్శకంగా మంజూరు అవుతాయని చెప్పారు. మధ్యవర్తులతో పనేమీ ఉండదని స్పష్టం చేశారు. రుణాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు

ప్రభుత్వ పథకాల పేరుతో, అధికారిక సేవల పేరుతో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడినా, నగదు డిమాండ్‌ చేసినా స్వయం సహాయక సంఘ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోవద్దని కలెక్టర్‌ అన్నారు. బాధితులు తగిన ఆధారాలతో నేరుగా తనకు గానీ, డీఆర్‌డీఏ పీడీకి కాని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. డీఆర్‌డీఏ జిల్లా కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక కాల్‌ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. బాధితులు 9390505066 నంబర్‌కు ఫోన్‌చేసి తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని సూచించారు. జిల్లాలో అవినీతి రహిత, పారదర్శకమైన వ్యవస్థను బలోపేతం చేసేందుకు మహిళా సంఘాల సభ్యులందరూ జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement