ఏర్పేడు: సవాళ్లతో కూడిన పరిశోధనలతోనే అద్భుత ఫలితాలు సాధించొచ్చని డీఆర్‌డీవో మాజీ చైర్మన్, ప్రముఖ రక్షణ, ఏరోస్పేస్ శాస్త్రవేత్త డా.జి.సతీష్‌రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం, జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్ కొలీజియం హాల్‌లో శుక్రవారం 7వ స్నాతకోత్సవం ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సతీష్‌రెడ్డి, ఐసర్ డైరెక్టర్ శాంతను భట్టాచార్య, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ హరిబార్తియ, రిజిస్ట్రార్ ఇంద్రప్రీత్ సింగ్ కోహ్లీతో కలసి 214 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు.
ఎడ్యుకేషన్ హబ్‌గా తిరుపతి
సతీష్‌రెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి ‘వికసిత భారత్’ అనే భారతదేశ దార్శనికత ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. ఐసర్, ఐఐటీ రెండు జాతీయ విద్యాసంస్థలు ఒక్కచోటే ఉండడం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందన్నారు. దేశరక్షణ వ్యవస్థ ఎంతో సాంకేతికతను మేళవించుకుని అనూహ్యరీతిలో ఆయుధాలను తయారు చేస్తోందన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కర్తలుగా మారి దేశాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాలలో మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తిరుపతి ఐసర్ డైరెక్టర్ ఐసర్ సాధించిన విజయాలు, విద్యార్థులు చేసిన నూతన ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న సౌకర్యాలను వివరించారు.


