కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి రోజా పోరాటంతో కేసు నమోదు.. రూ.10 లక్షల పరిహారం తీర్పును వెల్లడించిన ప్రత్యేక పోక్సో కోర్టు
చిన్నారిపై అత్యాచారం ..
బాదిత కుటుంబం పక్షాన నిలబడి, న్యాయం కోసం మాజీ మంత్రి రోజా చేసిన పోరాటం వల్ల ఆ పేద కుటుంబానికి న్యాయం చేకూరింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే 2024 నవంబర్ 1వ తేదీన తిరుపతి జిల్లా, వడమాలపేట మండలం ఏఎంపురం ఎస్టీ కాలనీలో చోటుచేసుకున్న చిన్నారిపై హత్యాచారం కేసు సంచలనం సృష్టించింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భయపడ్డ హోం మంత్రి, నాటి జిల్లా ఎస్పీ కేసును నీరు గార్చే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి రోజా బాధిత కుటుంబంతో కలసి చేపట్టిన పోరాటంతో పోక్సో కేసు నమోదుతో పాటు బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించారు.
పోక్సో కేసు కోరుతూ ఆందోళనకు దిగిన
మాజీ మంత్రి ఆర్కే రోజా (ఫైల్)
బాధిత తల్లిని అక్కన చేర్చుకొని ఓదార్చుతున్న మాజీ మంత్రి ఆర్కే రోజా (ఫైల్)
వడమాలపేట (పుత్తూరు): నగరి నియోజకవర్గ పరిధిలోని వడమాలపేట మండలం ఎఎంపురం ఎస్టీ కాలనీలో అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారిని ఓ కామాంధుడు చిధిమేసి, హత్య చేసిన కేసులో శుక్రవారం ప్రత్యేక పోక్సో కోర్టు ముద్దాయికి యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెల్లడించింది. ముద్దాయి పాముల నాగరాజు అలియాస్ సుశాంత్‌కు అత్యాచారం కేసులో జీవితాంతం కఠిన కారాగార శిక్షతో పాటు, హత్య కేసులోనూ మరో జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధింపు, రెండు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ముద్దాయి జీవితాంతం సహజ మరణం వరకు జైలులోనే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. బాలిక తల్లిదండ్రులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
కేసు పూర్వాపరాలు
వడమాలపేట మండలం ఎఎంపురం ఎస్టీ కాలనీకి చెందిన మూడున్నరేళ్ల చిన్నారికి బిస్కెట్లు కొనిస్తానని ముద్దాయి పాముల నాగరాజు అలియాస్ సుశాంత్ గ్రామ శివార్లకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవడంతో గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని పొదల్లో పడేశాడు. గ్రామస్తులు చిన్నారి మృతదేహాన్ని గుర్తించగా, బాదిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు నాటి తిరుపతి జిల్లా ఎస్పీ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు.
మాజీ మంత్రి రోజా పోరాటంతో కేసు నమోదు
చిన్నారిపై అత్యాచారం, హత్య కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని తెలుసుకొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డితో కలసి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న నేపథ్యంలో బాధిత కుటుంబంతో కలసి ఆందోళన చేపట్టారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం పోక్సో కేసు నమోదుతో పాటు రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. రెండేళ్ల పాటు జరిగిన విచారణ నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేక పోక్సో కోర్టు ముద్దాయికి యావజ్జీవ శిక్షణను ఖరారు చేసింది.


