నీరుగారుతున్న వంద రోజుల
ఉపాధి లక్ష్యం
జిల్లాలో కూలీల కన్నీటి వ్యథ
ఆశలు ఆవిరి.. వలసలే దారి
కూలీలకు సకాలంలో అందని నగదు
అప్పుల ఊబిలో పేదలు
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామీణ పేదలకు వరంలా ఉన్న ఉపాధి హామీ పథకం ఇప్పుడు నీరసిస్తోంది. పథకం అమలులో క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా అందుతున్న గణాంకాలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు అధికారుల పనితీరుపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. జిల్లాలో 2.46 లక్షల ఉపాధి జాబ్ కార్డులు ఉండగా, తక్కువ సంఖ్యలో కూలీలకు ఉపాధి దొరుకుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 35 శాతం మందికి మాత్రమే 100 రోజుల పని దినాలు కల్పించారనేది ఆందోళన కలిగించే విషయం. లక్షలాది మంది కూలీలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయి పని దొరకపోవడం పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. ఫలితంగా కుప్పం, పలమనేరు, గంగవరం, గుడుపల్లి, శాంతిపురం, రామకుప్పం ప్రాంతాల నుంచి పేద ప్రజలు కూలి పనుల కోసం కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్తున్నారు. అలాగే చిత్తూరు, యాదమరి, నగరి, విజయపురం, కార్వేటినగరం, పాలసముద్రం ప్రాంతాల నుంచి తమిళనాడుకు వలస వెళ్తున్నారు.
నెలల తరబడి అందని వేతనాలు
గతంలో వారం తిరగకముందే కూలీల బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు జమ అయ్యేవి. చంద్రబాబు ప్రభుత్వంలో నెలలు నిరీక్షించినా కూలీలకు వేతనాలు అందడం లేదు. జిల్లాలో పాడి పరిశ్రమపై ఆధారపడిన చిన్న రైతులు సైతం ఈ వేతనాల కోసమే ఎదురుచూస్తున్నారు. దీంతో నిత్యావసరాలు, పశుగ్రాసం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో అప్పుల పాలవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపం వెరసి అట్టడుగు వర్గాలకు అందాల్సిన ఫలాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూటమి నేతలు యంత్రాలతో పనులు చేసి కూలీలతో చేయించినట్టు రికార్డులు సృష్టించి బిల్లులు చేసుకుంటున్నారు. దీనిపై గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు అందగా ఆయన విచారణకు ఆదేశించారు.
ప్రధాన సమస్యలు ఇవే..
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు ఉపాధి కరువైంది. అండగా
ఉండాల్సిన ఉపాధి హామీ పథకం అధికారులు, కూటమి నేతల పుణ్యమా అని నిర్వీర్యమైంది. చట్టం ప్రకారం కూలీలకు వంద రోజులు పనిదినాలు కల్పించాల్సి ఉన్నా పరిస్థితి భిన్నంగా ఉంది. సరైన సమయంలో పనులను గుర్తించి అమలు చేయడం లేదు. చేసిన అరకొర పనులకు సైతం నెలల తరబడి బిల్లులు ఇవ్వడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కూటమి నేతలు యంత్రాలతో పనులు చేస్తున్నారు. వాటిని కూలీలతో చేయించినట్టు ఫొటోలు అప్‌లోడ్ చేసి బిల్లులు స్వాహా చేస్తున్నారు. దీంతో పనులు లేక కూలీలు పట్టణాలకు వలస బాట పడుతున్నారు.
జిల్లా సమాచారం
జాబ్‌కార్డులు 2.46 లక్షలు
నమోదైన కుటుంబాలు 2,46,472
నమోదైన కూలీలు 4,22,624
ఉపాధి పొందుతున్న కుటుంబాలు
1,03,386
ఉపాధి పొందుతున్న కూలీలు 1,54,316
కూలీల ఆశలు ఆవిరి
జిల్లాలోని పడమటి మండలాలు ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి పనులే పేదలకు ఆసరా. నేడు ఆ ఆశలు ఆవిరవుతున్నాయి. అడిగిన వారందరికీ పనికల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కూలీలకు పనులు దొరకడమే గగనమైంది. జిల్లాలో 2.46 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉండగా వాటిలో కొద్ది మందికి మాత్రమే వంద రోజుల పని దక్కింది. 80 శాతం మంది కూలీలకు పనులు కల్పించలేదని అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది.


