మళ్లీ రైస్‌ పుల్లింగ్‌! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ రైస్‌ పుల్లింగ్‌!

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

సామాన్యులే లక్ష్యంగా మోసాలు రూ.కోట్లు పలుకుతాయంటూ నమ్మిస్తున్న వైనం స్థానికంగా ఏజెంట్ల నియామకం తాజాగా పెద్దపంజాణి మండలంలో వెలుగు చూసిన ఘటన

కొంతమంది సులభంగా డబ్బు సంపాదించడానికి పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. రైస్‌ పుల్లింగ్‌ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో పలమనేరు ప్రాంతంలో రైస్‌ పుల్లింగ్‌ ముఠాలు ఎక్కువగా ఉండేవి. పలువురిని మోసం చేసి రూ.లక్షలు స్వాహా చేశారు. పోలీసుల దాడులతో సైలెంట్‌గా ఉన్న వారు మళ్లీ విజృంభిస్తున్నారు. స్థానికంగా ఉన్న కొంతమందిని ఏజెంట్లుగా నియమించుకుని సామాన్యులను ఈ ఉచ్చులోకి దించుతున్నారు. తాజాగా పెద్దపంజాణి మండలం కమ్మపాళెం గ్రామంలో రైస్‌ పుల్లింగ్‌ తరహా మోసం జరిగినట్టు తెలిసింది. పోలీసులు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పడమర ప్రాంతాల్లో కొన్నాళ్లుగా రైస్‌ పుల్లింగ్‌ ముఠాల కదలికలు జోరందుకున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకకు సరిహద్దుగా ఉన్న పలమనేరు ప్రాంతంలో ముఠా సభ్యులు మళ్లీ తమ కార్యకలాపాలను చేపట్టినట్టు తెలిసింది. కొంతమందిని ఏజెంట్లుగా నియమించుకున్నట్టు సమాచారం. వారి మాటలు నమ్మి సులభంగా రూ.లక్షలు సంపాదించవచ్చనే ఆశతో చాలామంది ఈ వృత్తిలోకి దిగారు. గతంలో ఈ ముఠాలతో మోసపోయన బాధితులు సైతం తిరిగి ఇదే రొచ్చులోకి దిగి పలువురుని మోసం చేస్తున్నట్టు తెలిసింది.

రైస్‌ పుల్లింగ్‌ అంటే..

పురాతన కాలం నాటి అక్షయ పాత్ర, రాగి పాత్రలు బియ్యాన్ని ఆకర్షించే శక్తి ఉండడాన్నే రైస్‌ పుల్లింగ్‌ అంటారు. వాస్తవానికి ఇది ఒక భ్రమ. కొందరు కొన్ని రకాల రసాయాలను ఉపయోగించి రాగి పాత్ర బియ్యాన్ని లాగేలా చేస్తారు. సైన్స్‌ పరంగా ఆలోచిస్తే రాగిలో ప్యారామ్యాగ్నటిజమ్‌ ఉంటుంది. ఇది హైడ్రోజన్‌ను స్వీకరించే గుణం కలిగి ఉంటుంది. వడ్ల పొట్టును తీసిన తాజా బియ్యపు గింజల్లో హైడ్రో కార్బన్లు ఉంటాయి కాబట్టి చర్య ప్రతిచర్య జరిగే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనా ఇలాంటి బియ్యాన్ని ఆకర్షించే రాగి పాత్రలకు బయటి దేశాల్లో రూ.కోట్ల గిరాకీ ఉందని ఈ ముఠా సభ్యులు నమ్మబలుకుతున్నారు. ముఖ్యంగా పాతకాలం నాటి రాగి పాత్రల్లో ఎంతో విలువైన యురేనియం ఉంటుందంటూ చెబుతున్నారు. ఇందులో ఆర్‌పీ అంటే రైస్‌ పుల్లింగ్‌ అని, సీఆర్పీ కాపర్‌ రైస్‌ పుల్లర్‌ అని, సీఐపీ అంటే కాపర్‌ ఇరిడియమ్‌ రైస్‌ పుల్లర్‌ అని చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు.

మరోవైపు గుప్తనిధుల వేట

కొన్ని ముఠాలు గుప్తనిధుల కోసం పలమనేరు మండలంలోని బాపలనత్తం పాండవగుహలను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇక ఈ ప్రాంతంలోని పాడుబడిన పురాతన ఆలయాల కింద గుప్తనిధులు ఉన్నాయంటూ మోసాలకు పాల్పడ్డాయి. ఆ ముఠా సభ్యుల మాటలు నమ్మిన కొందరు స్థానికులు దురాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవడంతోపాటు పోలీసులకు చిక్కి ఇబ్బందులు పడుతున్నారు.

అదృశ్యమవుతున్న వ్యక్తులు

రైస్‌ పుల్లింగ్‌ ద్వారా సులభంగా లక్షాధికారులు కావచ్చనే ఆశతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొందరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. పదేళ్లలో దాదాపు పది మందికి పైగా అదృశ్యమైనట్లు సమాచారం. అలాగే పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యోగులు రూ.లక్షల్లో మోసపోయారు. రైస్‌ పుల్లింగ్‌ అంటూ ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్‌ చెబుతున్నారు.

రెచ్చిపోతున్న ముఠాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement