అడ్మిషన్లకు విద్యార్థులు (ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్) వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపికై న విద్యార్థులకు వారి రిజిస్టర్ మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం పంపుతారు.
ఎంపిక జాబితాను సంబంధిత పాఠశాలల నోటీసు బోర్డుల్లో ప్రదర్శిస్తారు.
కేజీబీవీల్లో అన్ని సౌకర్యాలు 7 కేజీబీవీల్లో 560 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం ఇప్పటికే 1,363 దరఖాస్తుల నమోదు గడువు పెంచడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం
చిత్తురు కలెక్టరేట్ : జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయల్లో (కేజీబీవీ) 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల పర్వం కొనసాగుతోంది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క కేజీబీవీలో 40 సీట్ల చొప్పున 280 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్లు చొప్పున 280 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి 6వ తరగతికి 693 దరఖాస్తులు, ఇంటర్ మొదటి సంవత్సరానికి 670 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు గడువును మరో వారం రోజులు పెంచడంతో మరో 2 వేల వరకు దర ఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన దరఖాస్తుల ఆధారంగా 6వ తరగతి, ఇంటర్‌లో ఒక్కో సీటుకు ఇద్దరు చొప్పున విద్యార్థులు పోటీ పడుతున్నారు.
రామకుప్పం మండలంలోని విజలాపురం కేజీబీవీ పాఠశాల
ప్రత్యేక తరగతుల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు
ఎంపిక ప్రక్రియ, పర్యవేక్షణ ఇలా..
గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అనాథ, డ్రాపౌట్స్, వెనుకబడిన తరగతుల బాలికలకు ఉచితంగా విద్య అందించానలే ఉద్దేశంతో కస్తూర్భాగాంధీ విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటిల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే అవకాశం ఉంది. నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఉచిత వసతి, పోషక విలువలతో కూడిన భోజనం, సురక్షితమైన వాతావరణం తదితర వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగింది. జిల్లాలోని ఏడు కేజీబీవీల్లో 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఖాళీ సీట్ల కోసం బాలికలు అధికంగా పోటీ పడుతున్నారు.
ప్రతి బాలికకూ విద్య అందాలన్నదే లక్ష్యం
జిల్లాలోని కేజీబీవీల్లో అడ్మిషన్లకు ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికే సీట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో ఎస్పీడీ ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు పెంచారు. కేజీబీవీల్లో నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. అర్హులైన బాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏవైనా సమస్యలుంటే జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
– మద్దిపట్ల వెంకటరమణ, ఏపీసీ, సమగ్రశిక్ష శాఖ


