చిత్తూరు కలెక్టరేట్ : భారతదేశ సామాజిక విప్లవ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మాజ్యోతిరావు పూలే అని జాయింట్ కలెక్టరేట్ ఆదర్శ్ రాజేంద్రన్ కొనియాడారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో శనివారం పూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పీసీఆర్ సర్కిల్‌లో ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ 200 ఏళ్ల క్రితమే సమాజంలోని అంటరాని తనం, కుల వివక్ష, మూఢ నమ్మకాలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు. 1848లోనే తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి దేశంలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారని పేర్కొన్నారు. తద్వారా మహిళా విద్యకు పునాదులు వేశారని తెలిపారు. ఆయన చేసిన కృషి వల్లే నేడు వెనుకబడిన వర్గాల జీవితాల్లో విద్యా విప్లవం సాధ్యమైందన్నారు. పూలేను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీబాష, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


