వలస పక్షుల్లా.. భాషోపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

వలస పక్షుల్లా.. భాషోపాధ్యాయులు

Aug 21 2025 7:20 AM | Updated on Aug 21 2025 7:20 AM

వలస ప

వలస పక్షుల్లా.. భాషోపాధ్యాయులు

బలవంతపు బదిలీలతో తప్పని తిప్పలు గత ఆరేళ్లలో నాలుగు సార్లు బదిలీలే బదిలీ అయిన చోటా వీరిని పెట్టకుండా డిప్యూటేషన్లు విద్యాసంవత్సరం చివరి రోజు మాత్రమే వీరు సొంతబడికి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు బేఖాతర్‌ న్యాయం చేస్తామన్న ఉపముఖ్యమంత్రి పట్టించుకోలేదు !

పలమనేరు: కొన్నేళ్లుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. వీరికి బలవంతపు బదిలీలు, డిప్యూటేషన్లు తప్పడం లేదు. గత ఆరేళ్లలో నాలుగు దఫాలు వీరు బదిలీకే పరిమితమవుతున్నారు. పోనీ బదిలీతో ఆపుతారనుకుంటే అదీ లేదు. వీరిని డిప్యూటేషన్లపై వేరే బడికి పంపడం రివాజుగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాల్లో పనిచేస్తున్న 164 మంది భాషోపాధ్యాయులు వలసపక్షుల్లాగా మారిపోయారు. కోర్టుమెట్లెక్కి అనుమతి తీసుకున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై పలువురు భాషోపాధ్యాయులు రగిలిపోతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే?

2019లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులకు (తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా, సంస్కృతం) జీవో నంబర్‌ 91 మేరకు ఉన్నతీకరణ జరిగింది. ఆ జీవో అమలు కాకుండా కొందరు కోర్టుకెళ్లారు. ఈ నేపథ్యంలో వీరిని పక్కనబెట్టి ఉన్నతీకరణలో ఎస్‌జీటీలకు చోటు కల్పించేలా ఆదేశాలను తెచ్చారు. దీంతో విద్యాశాఖ జీవో నంబర్‌77 ద్వారా ఎస్జీటీలకు మేలు కలిగేలా చేశారు. ఎల్‌పీ(ల్యాంగేజ్‌ పండిట్స్‌) కేడర్‌ లేకుండా చేశారు. ఈ క్రమంలో వీరికి ఎల్‌పీ వ్యవస్థా లేకుండా .. ఉన్నతీకరణ లేకుండా పోయింది.

కోర్టు ఆదేశాలు బేఖాతర్‌

తమకు జరిగిన అన్యాయంపై భాషోపాధ్యాయులు 2024లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టీస్‌ మన్మధరావు సింగిల్‌ బెంచ్‌ వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. 2019 నుంచి వీరికి అన్ని సదుపాయాలను కల్పించి, మూడు నెలల్లో ప్రమోషన్‌ అర్హతలున్నవారికి అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును అమలు చేయాలని భాషోపాధ్యాయులు రాష్ట్ర విద్యాశాఖను కోరింది. దీంతో వారు వేకన్సీలు లేవని సెలవుల్లో ఈ ప్రక్రియ ఉంటుందని దాట వేసింది. ఇది జరిగితే తమకు ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఎస్జీటీలు దీనిపై హైకోర్టులో స్టేటస్‌కో ఉత్తర్వులను పొందారు. ఫలితంగా వీరి సమస్య మరింత జఠిలంగా మారింది. అప్పట్లో విద్యాశాఖ చేసిన అలసత్వం వీరికి శాపంలా మారింది.

బలవంతపు బదిలీలు

తమపైనే కోర్టుకెళ్లారనే అక్కసుతో విద్యాశాఖ సైతం వీరితో చెలగాటమాడుతోంది. ఆ మేరకు గత ఆరేళ్ల లో వీరిని నాలుగు దఫాలు బదిలీలను చేసింది. బదిలీ చేసిన చోటా ఉంచకుండా వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ సాకుతో మూడు నెలలు, ఆరు నెలలు ఓ బడిలో పనిచేశాలా డిప్యూటేషన్లు వేస్తోంది. మళ్లీ అధికారికంగా బదిలీ అయిన బడికి ఆ విద్యాసంవత్సరంలో చివరి రోజు పంపుతోంది.

చేతులెత్తేసిన డిప్యూటీ సీఎం

తమ సమస్యను మీరైనా పరిష్కరించాలంటూ గత యేడు తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా పలువురు భాషోపాధ్యాయులు ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను వేడుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం లోపు మీ సమస్యలు పరిష్కరిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. కానీ రెండేళ్లవుతున్నా దీనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

క్యాడర్‌ లేకుండా ఆరేళ్లుగా

పనిచేస్తున్నా

నేను ఆరేళ్లుగా క్యాడర్‌ లేకుండా పనిచేస్తున్నా. కనీసం మాకు జాబ్‌కార్డు కూడా లేదు. ప్రమోషన్లూ లేకుండా చేశారు. కోర్టు తీర్పునిచ్చినా విద్యాశాఖ వాటిని అమలు చేయడం లేదు. ఇంత దారుణం ఎక్కడా లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో..?

– బెంగళూరు స్వామినాథుడు,

తెలుగు పండిట్‌, గుడిపల్లి మండలం

ఆడుకుంటున్నారు

మేమేం పాపంచేశామోగానీ విద్యాశాఖ మాకు ఎలాంటి క్యాడర్‌ లేకుండా, ప్రమోషన్లు లేకుండా చేసింది. దీంతోపాటు ఉన్నత పాఠశాలలో భోదించే మమ్మల్ని ప్రైమరీ బడులకు పంపుతోంది. అదీ ఓ చోట కాదు ఎక్కడిబడితే అక్కడికి వెళ్లి పాఠాలు చెప్పాలి. మహిళలమైన మాకు మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా స్పందించాలి. – భాగ్యలక్ష్మి, తెలుగు పండిట్‌,

రామసముద్రం

ఇంత వివక్ష ఎందుకు?

తెలుగు భాషోపాధ్యాయులపై విద్యాశాఖ ఎందుకింత వివక్ష చూపుతోందో అర్థం కావడం లేదు. మేము ఉన్నత పాఠశాలలో తెలుగును బోధించాలి. కానీ మమ్మల్ని ప్రైమరీ బడుల్లో టీచర్లు సెలవు పెట్టిన చోటుకు పంపుతున్నారు. జాబ్‌చార్ట్‌లేకుండా చేసి ఎక్కడిపడితే అక్కడికి పంపుతున్నారు.

– హిమబిందు, జెడ్పీహెచ్‌ఎస్‌, కే.గొల్లపల్లి, యాదమరి మండలం

వలస పక్షుల్లా.. భాషోపాధ్యాయులు 1
1/3

వలస పక్షుల్లా.. భాషోపాధ్యాయులు

వలస పక్షుల్లా.. భాషోపాధ్యాయులు 2
2/3

వలస పక్షుల్లా.. భాషోపాధ్యాయులు

వలస పక్షుల్లా.. భాషోపాధ్యాయులు 3
3/3

వలస పక్షుల్లా.. భాషోపాధ్యాయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement