
హంద్రీనీవా కాలువ పనుల పరిశీలన
కుప్పం: నియోజక వర్గంలో జరుగుతున్న హంద్రీనీవా కాలువ పనులను జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలో పూర్తి చేసి నీరు తీసుకువస్తామన్నారు. నియోజక వర్గంలోని 430 చెరువులను హంద్రీనీవా జలాలతో నింపుతామన్నారు. చెరువుల సామర్థ్యం, చెక్‌డ్యాములు బాగు చేయడం, నీటి నిలువల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీఈలను ఆదేశించారు. అనంతరం రాష్ట్రంలోనే కుప్పంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన డిజిటల్ సర్వే సెంటర్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికను వినియోగించుకోవడంతో వ్యాధులను ముందుగానే గుర్తించే చికిత్సలు తీసుకోవచ్చన్నారు. కుప్పం నియోజక వర్గంలో 13 పీ హెచ్‌సీలు, 92 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానం చేశామన్నారు. వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఈ కేంద్రాలు చూస్తాయన్నారు. డిజిటల్ సర్వే సెంటర్లను పరిశీలించి, ఎంత మంది పేషంట్లు వస్తున్నారు.. డాక్టర్లు ఏ సమయానికి వస్తున్నారు.. ఎప్పుడు వెళుతున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీ ర్ తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వరప్రసాద్, హెచ్‌ఎన్‌ఎస్ ఎస్ ఎస్‌ఈ విఠల్‌ప్రసాద్, కుప్పం ఎగ్జిక్వూటివ్ ఇంజినీర్ గోవర్ధన్ పాల్గొన్నారు.