
బాబూ..దివ్యాంగులపై ఎందుకంత కక్ష?
● వైఎస్సార్‌సీపీ పూతలపట్టు సమన్వయకర్త డాక్టర్ సునీల్
యాదమరి: ‘ కూటమి సర్కారు దివ్యాంగులపై కనీసం మానవత్వం చూపలేదు. పైగా వారు పదేళ్లుగా తీసుకుంటున్న పింఛన్లు కోత పెట్టింది. వారిపై ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో చెప్పాలి.?’ అని వైఎస్సార్‌సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ మండిపడ్డారు. బుధవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దుర్భర జీవితాలు అనుభవిస్తున్న దివ్యాంగులపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న తీరు బాధాకరమన్నారు. కూటమి సర్కారు దివ్యాంగులను మానవతా ధృక్పథంతో ఆదుకోవాల్సింది పోయి, వారి బతుకులతో ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. రీ వెరిఫికేషన్ పేరుతో ఇప్పటికే జిల్లాలో 4,732 మంది అర్హత కలిగిన ల బ్ధి దారుల పింఛన్లను తొలగించడం దారుణమన్నారు. పూర్తిగా మంచానికే పరిమితమైన మానసిక, శారీరక వైకల్యం కలిగిన నిజమైన పింఛనుదారులకు సైతం సెప్టెంబర్ నెల నుంచి తమకు పింఛన్ రాదని అధికారులతో నోటీసులు ఇవ్వడం శోచనీయమన్నారు. అదే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? అని అన్నారు. దివ్యాంగుల శోకం రాష్ట్రాభివృద్ధికి అంత శ్రేయస్సు కాదని చంద్రబాబుకు హితవు పలికారు. సదరం ధ్రువపత్రాల కోసం నడవలేని స్థితిలో ఉన్నవారి ఆస్పత్రుల చుట్టు తిప్పడం సమంజసం కాదన్నారు. ప్రజల ముంగిటికే ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నామని ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్న కూటమి నేతలు..వైద్య పరీక్షలు కూడా వికలాంగుల చెంతకే వెళ్లి చేయవచ్చు కదా? సూటిగా ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు సృష్టించాలన్నా.. వాటి ఫలాలు ప్రజలకు అందాలన్నా.. అది కేవలం వైఎస్ జగనన్నకే సాధ్యమన్నారు. సంక్షేమ పథకాల కోతలపై కూటమి ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల తరఫున పోరాటం ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.