చంద్రగిరి : ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టడంతో ఆయనకు త్వరగా బెయిల్ రావాలంటూ ఆయన అభిమానులు తిరుమల వెంకన్నకు మొక్కుకున్నారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పీలేరు నుంచి తిరుమలకు పాదయాత్రను చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం వారిని పోలీసులు అక్రమంగా అడ్డుకుని, స్టేషన్‌లో నిర్భందించారు. రాత్రి వరకు స్టేషన్‌లోనే ఉంచుకుని ఆపై సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం బుధవారం ఉదయం హరిప్రసాద్ రెడ్డితో పాటు అభిమానులు శ్రీవారిమెట్టుకు చేరుకున్నారు. ముందుగా అక్కడ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి తిరుమలకు పాదయాత్రను కొనసాగించారు. తిరుమలకు చేరుకున్న వారు శ్రీవారిని దర్శించుకుని, తమ అభిమాన నేత ఎంపీ మిఽథున్ రెడ్డికి త్వరగా బెయిల్ మంజూరు కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందన్నారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అక్రమంగా అడ్డుకుని, నిర్భదించడం దీనికి ఉదాహరణ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.