
ఐటీఐ మూడో విడత అడ్మిషన్లకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో మూడో విడత అడ్మిషన్లకు అవకాశం కల్పించారని జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లకు ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. www.iti.ap.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 26వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు చేసుకున్న అనంతరం ప్రభుత్వ ఐటీఐ అడ్మిషన్ విద్యార్థులకు ఈ నెల 29వ తేదీన, ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు ఈ నెల 30వ తేదీన అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 7799679351, 9440738121, 9182590869 నెంబర్‌లలో సంప్రదించాలని ఆయన కోరారు.
మామిడి చెట్లను ఆర్గానిక్ పద్ధతిలో పోషించాలి
తవణంపల్లె: రైతులు మామిడి చెట్లను ఆర్గానిక్ పద్ధతిలో పోషించాలని రియల్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రామారావు, సంస్థ చైర్మన్ హనీషా తెలిపారు. తవణంపల్లెలో ఉపాధి హామీ కార్యాలయంలో రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామారావు మాట్లాడుతూ మండలంలోని సరకల్లు, అరగొండ, తడకర, ఈచనేరి, వడ్డిపల్లె, ఉత్తరబ్రాహ్మణపల్లె, గళ్లావాళ్లవూరు, దిగువ మత్యం గ్రామాల్లోని 20 మంది రైతులకు 35 ఎకరాల్లో 2,800 అన్ని రకాల మామిడి చెట్లు అందించినట్లు పేర్కొన్నారు. రైతులు చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో రైతులకు ఉచితంగా మామిడి చెట్లు అందించినట్లు తెలిపారు. రైతులు ఆర్గానిక్ పద్ధతిలోనే మొక్కలు పెంచాలన్నారు. తవణంపల్లె క్లస్టర్ కోఆర్డినేటర్ శ్యామల, నవీన్ పాల్గొన్నారు.
చిత్తూరు రూరల్(కాణిపాకం): జిల్లాలో ఎంపిక చేసిన 10 మండలాల్లో గురువారం విధిగా ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సేవలు నిర్వహించాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ వెంకట ప్రసాద్ ఆదేశించారు. బుధవారం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్టీ జనాభా అత్యధికంగా ఉన్న గ్రామాల్లో ఆరోగ్య సంరక్ష ణ సేవలు నిర్వహించాలన్నారు. సచివాలయం, విలేజ్ హెల్త్ క్లీనిక్‌ల వద్ద శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటలకు శిబిరాల్లో వైద్యసేవలందించాలని స్పష్టం చేశారు. చిత్తూరు, విజయపురం, పెనుమూరు, నిండ్ర, కార్వేటినగరం, యాదమరి, గంగవరం, రాయల్‌పేట, పెద్ద ఉప్పరపల్లె, శాంతిపురం మండలాలను ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సేవలకు ఎంపిక చేసినట్లు వివరించారు.
కుమరేషన్‌కు తెలుగుతేజం అవార్డు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరుకు చెందిన అధ్యాపకులు కుమరేషన్ శ్రీశ్రీకళా వేదిక తెలుగు తేజం అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 31వ తేదీన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో జరిగే వేదికలో ఈ అవార్డును అందుకోనున్నారు. ఈయనతో పాటు జిల్లాలో మరో 6 మంది కవులు ఎంపికయ్యారు.

ఐటీఐ మూడో విడత అడ్మిషన్లకు అవకాశం