
ప్రొటోకాల్ పాటించరూ!
కాణిపాకం బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలో ప్రొటోకాల్ లేదని మండిపాటు ఆలయంలో పార్టీలెందుకని ప్రశ్నల వర్షం కూటమి ప్రజాప్రతినిధుల మాత్రమే ఫొటోల ముద్రణపై ఆగ్రహం
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలో ప్రొట్‌కాల్ ఉల్లఘించారని కాణిపాక వాసులు మండిపడుతున్నారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏటా ప్రొటోకాల్ ప్రకారమే ఆహ్వాన పత్రికలు ముద్రించేవారు. ఈ ముద్రణ పార్టీలకతీతంగా ఉండేది. గత ఐదేళ్లలో కూడా ప్రొటోకాల్‌కు ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ దొరబాబు ఫొటోతో సహా ముద్రిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రూల్స్ మారాయని కాణిపాకం వాసులు మండిపడుతున్నారు. కూటమికి చెందిన ప్రజాప్రతినిధుల ఫొటోలు మాత్రమే పత్రికలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, భరత్, చంద్రశేఖర్‌రెడ్డి ఫొటోలు లేకుండా పేర్లు మాత్రమే ముద్రించారని, ఇంతకీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటీకి ప్రొటోకాల్ ఉల్లంఘనే అంటూ ఉభయదారులు, కాణిపాక వాసులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నారు. కాగా 2024లో వారి ఫొటోలతో సహా ముద్రించడం గమనార్హం.