
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీనివాసరాజు, పక్కన రచయిత కృష్ణస్వామిరాజు
పుత్తూరు రూరల్: పుత్తూరు పిల ‘గోడు’ హాస్య కథల పుస్తకం మాతృ భాషకు పట్టంగట్టిందని, ప్రతి వ్యక్తి తన మాతృ భాషను మరువకూడదని తెలంగాణ రవాణ, ఆర్‌అండ్‌బీ శాఖ సెక్రెటరీ కేఎస్.శ్రీనివాసరాజు పేర్కొన్నారు. పుత్తూరుకు చెందిన ప్రము ఖ కథా రచయిత ఆర్సీ కృష్ణస్వామిరాజు రచించిన పుత్తూరు పిల‘గోడు’ హాస్య కథల పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచయిత మాతృ భాషకు పట్టం కడుతూ హాస్యరసాన్ని కథల రూపంలో అందించడం ఆనందదాయకమన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మాండలికంలో యాభై ఏళ్ల క్రితం జరిగిన సరదా సన్నివేశాలను రచయిత కథలుగా మలచడం పాఠకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయన్నారు. అంతకు ముందు రచయిత ఆర్సీ కృష్ణస్వామిరాజును ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌కు చెందిన ‘అచ్చంగా తెలుగు ప్రచురణ’ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయితలు పాణ్యం దత్తశర్మ, సినీ నటులు జెన్నీ, సీనియర్ జర్నలిస్టు బి.ప్రసాదరావు, పద్మిని తదితరులు పాల్గొన్నారు.