
కవితపై దాడి చేస్తున్న పచ్చమూకలు
పాత కేసులో రాజీ చేసుకోకుంటే చంపేస్తామంటూ బెదిరింపు
గంగవరం: చిత్తూరు జిల్లాలో ఓ వైఎస్సార్‌సీపీ మండల బీసీ నాయకురాలిపై టీడీపీ మూకలు శనివారం విచక్షణారహితంగా దాడి చేశాయి. గంగవరం మండలం ఆలకుప్పం గ్రామంలో బోయ సామాజికవర్గానికి చెందిన కవిత ఇటీవలే వైఎస్సార్‌సీపీ మండల బీసీ మహిళాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బాధితురాలి సోదరి నందినిపై గతంలో తేజ అనే యువకుడు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డాడు.
దీనిపై ఆమె ఫిర్యాదు మేరకు గంగవరం పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసును రాజీ చేసుకోవాలని ఇప్పటికే పలుమార్లు నందిని, కవితలను తేజ బెదిరించాడు. ఈక్రమంలో వినాయక చవితి పండుగ కోసం సోదరి ఇంటికి నందిని వచ్చింది. అయితే తేజ ఆలకుప్పం గ్రామం టీడీపీ నేత రాజన్నకు విషయం చెప్పాడు.
ఆయన ప్రోద్బలంతో పండగ రోజు నందిని, ఆమె సోదరి కవిత, తల్లి తిమ్ములమ్మపై తేజ, ఇతర నేతలు దాడి చేసి గాయపరిచారు. పాత కేసును రాజీ చేసుకోకుంటే ప్రాణం తీయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు పలమనేరులోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా టీడీపీ నేతల దాడిపై బాధితులు గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.