
గంజాయి బ్యాచ్, కిరాయి గూండాలతో దాడి చేయించిన టీడీపీ నేతలు
వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేసి హతమార్చేందుకు కుట్ర
బీసీ మహిళా జెడ్పీ చైర్‌పర్సన్ హారికను గంటన్నరసేపు నిర్బంధించిన వైనం
అసభ్య పదజాలంతో అవహేళనగా దూషించిన టీడీపీ గూండాలు
తమ కళ్ల ముందే దాడి జరిగినా నిందితులపై కేసు కూడా పెట్టని పోలీసులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ : బీసీ మహిళా జెడ్పీ చైర్‌పర్సన్, వైఎస్సార్ సీపీ నేత ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముపై పక్కా ప్రణాళిక ప్రకారమే పచ్చ సైకోలు హత్యాయత్నానికి పాల్పడినా పోలీసులు కనీసం స్పందించడంలేదు. దాడిని అడ్డుకోకపోగా.. నిందితులను గుర్తించి కనీసం కేసు నమోదు చేయలేదు. పాలకవర్గ సేవకే భక్షక భటవర్గం పరిమితమైదన్న విమర్శలను నిజం చేశారు. గుడివాడలో జరగాల్సిన ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శనివారం మధ్యాహ్నం నుంచే టీడీపీ నేతలు యత్నించారు. వివాదాస్పద పోస్టర్లతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.
వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను రాకుండా అడ్డుకొనే యత్నం చేశారు. సభకు వచ్చే మార్గాల్లో ముందుగానే టీడీపీ కిరాయి గూండాలు, గంజాయి, మద్యం తాగి కాపు కాసి వీరంగం సృష్టించారు. ఇందులో భాగంగానే సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న బీసీ మహిళ, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముపై గుడివాడ నాగవరప్పాడు వద్ద దాడికి తెగబడ్డారు.
కారు అద్దాలు పగలగొట్టి, మారణాయుధాలతో హతమార్చేందుకు యత్నించారు. రాయలేని భాషలో జిల్లా ప్రథమ మహిళపై బండబూతులతో రెచి్చపోయారు. హారిక దంపతులు గంటన్నరకుపైగా కారులోనే బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వచ్చింది. టీడీపీ నాయకులు, కిరాయి గూండాలు గంజాయి, మద్యం సేవించి వచ్చి దాడికి కుట్ర పన్నినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్ష పాత్ర వహించారే తప్ప, కనీసం పచ్చ గూండాలను నిలువరించే ప్రయత్నం చేయలేదు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తలను మాత్రం అటువైపు రాకుండా భారీ బందోబస్తుతో నిలువరించారు. గుడివాడలో దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు కూడా ఇబ్బంది పెట్టారు. దీనిని బట్టి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ డైరెక్షన్‌లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కనుసన్నల్లో దాడి జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తొలుత పెడన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవాలని, లేకపోతే ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు బాధితులకు ఉచిత సలహా ఇచ్చారు. దాడి జరిగిన ప్రాంతంలో ఫిర్యాదు తీసుకోకపోతే ఎలాగని జెడ్పీ చైర్‌పర్సన్ దంపతులు నిలదీయటంతో చివరకు పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు.
భగ్గుమన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు
గుడివాడలో ఉప్పాల హారికపై జరిగిన దాడి ఘటనపై మహిళా నేతలు భగ్గుమన్నారు. జెడ్పీటీసీలు సభ్యులు, ఎంపీపీలు పెడన మండలం కోడూరులోని ఉప్పాల హారిక స్వగృహంలో ఆమెను కలిసి దాడి ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. అనంతరం మచిలీపట్నంలో కృష్ణాజిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందచేసి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక స్వగృహానికి పార్టీ నాయకులూ వెళ్లి ధైర్యం చెప్పారు.
శాసన మండలి చైర్మన్ మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్ని కిట్టు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, గుడివాడ సీనియర్ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నేతలు, సన్నిహితులు, అభిమానులు తరలివచ్చి ఉప్పాల హారికకు సంఘిభావం తెలిపి పరామర్శించి ధైర్యం చెప్పారు.
తరలివచ్చిన మహిళా నేతలు
ఎమ్మెల్సీ, రాష్ట్ర వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, మాజీ హోం మంత్రి తానేటి వనిత, విజయవాడ, మచిలీపట్నం మేయర్లు రాయన భాగ్యలక్షి్మ, చిటికిన వెంకటేశ్వరమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు శీలం భారతి, విజయవాడ డెప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గతోపాటు పలు మహిళా సంఘాల నేతలు ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించి ఆమెను పరామర్శించారు.
నిందితులపై చర్యలేవీ?
దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇంత వరకు ఏ ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదంటే పోలీసులు ఏ విధంగా పని చేస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటికే దాడి చేసిన వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాతోపాటు అధికార పార్టీ నాయకులు స్టేటస్‌లుగా పెట్టుకుని ఆనంద పడుతున్నా కనీసం పోలీసులు వాటి గురించి ఆరా తీయకపోవడం కొసమెరుపు.

ఇదిలా ఉంటే దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు, గూండాలు, రౌడీలను తప్పించేందుకు ఎమ్మెల్యే యత్నిస్తున్నట్టు సమాచారం. అమాయకులను ఇందులో ఇరికించే యత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వారిలో తెలుగు యువత నేత గోవాడ శివ ఉన్నట్టు వీడియోలు ఉన్నా.. పోలీసులు చర్యలకు వెనుకాడుతుండడం అనుమానాలకు తావిస్తోంది.
రెడ్‌బుక్ రాజ్యాంగంలో మహిళలకు రక్షణ కరువు
∙జెడ్పీ చైర్‌పర్సన్ హారికపై దాడిని తీవ్రంగా ఖండించిన జెడ్పీటీసీ సభ్యులు
∙జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జెడ్పీటీసీలు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో జరిగిన దాడిని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. మహిళ అని కూడా చూడకుండా హారికపై హత్యాయత్నాకి పాల్పడిన టీడీపీ, జనసేన గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు ఆమె భర్త రాముపై దాడికి పాల్పడ్డ నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ మేరకు ఆదివారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు జిల్లా ఎస్పీ గంగాధరరావును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి నేతలు మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. జిల్లా ప్రథమ పౌరురాలికే రక్షణ లేకుండా పోయిందంటే రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు.
జరిగిన దాడిపై ఉప్పాల రాము గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ గరికపాటి శ్రీదేవి, చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాఇ కళ్యాణి, కృత్తివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.