
తువాలు బిగించడంతో ఎంపీపీ పురుషోత్తమరెడ్డి మెడకు అయిన గాయం
చిలమత్తూరు వైఎస్సార్‌సీపీ ఎంపీపీపై టీడీపీ గూండాల దాడి
చిలమత్తూరు: చేతిలో మారణాయుధాలు పట్టుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ మూక రెచ్చిపోయింది..! ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకుడే లక్ష్యంగా దాడికి దిగింది.. పైపెచ్చు బాధితుడిని పరామర్శించేందుకు వెళ్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడం ఈ దాడి వెనుక పెద్ద కుట్రను తేటతెల్లం చేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమరెడ్డిని హతమార్చేందుకు ప్రయత్నించింది. శుక్రవారం హుస్సేన్‌పురం గ్రామంలో ఈ ఘటన జరిగింది.
చౌడేశ్వరీదేవి ఆలయంలో పూజల అనంతరం పురుషోత్తమరెడ్డి ఇంటికి వెళ్తుండగా టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. టీడీపీకి చెందిన బాబూరెడ్డి, నర్సిరెడ్డి, మరో నలుగురు మారణాయుధాలతో వచ్చారు. ఎంపీపీ ఎత్తుగా ఉండడంతో ఎడమ కాలిపై ఇనుప రాడ్డుతో కొట్టి కిందపడేశారు. ఆయన మెడలోని తువాలుతోనే ఉచ్చు బిగించి చంపేందుకు ప్రయత్నించారు. ఇంతలో గ్రామస్థులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో బాబురెడ్డి, అతడి అనుచరులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పురుషోత్తమరెడ్డిని హిందూపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు.
దాడి సంగతి తెలిసి వైఎస్సార్‌సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక, ఆమె భర్త వేణురెడ్డిలు ఎంపీపీని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తుండగా.. రెండో పట్టణ పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై నిలదీయడంతో వదిలేశారు. ఆస్పత్రిలో పురుషోత్తమరెడ్డిని దీపిక దంపతులతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పరామర్శించారు.
నిందితులను అరెస్ట్ చేయాలని ధర్నా
పురుషోత్తమరెడ్డిపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలంటూ హిందూపురం సద్భావన సర్కిల్‌లో దీపిక, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందన్నారు. హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హత్యలు, దాడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీపీపై హత్యాయత్నం చేసిన టీడీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలోనే దీపికను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి.. వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. ఆమెతో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారు.
నిందితుడికే కట్లు.. టీడీపీ వింత నాటకం
పురుషోత్తమరెడ్డిపై దాడిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ వింత నాటకానికి తెరతీసింది. నిందితులను పార్టీ నుంచి తొలగించాల్సిన టీడీపీ నేతలు అందుకు విరుద్ధంగా చిలమత్తూరు రప్పించుకుని, లేని గాయానికి కట్టు కట్టించారు. తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి బాధిత ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపైనే విమర్శలు చేయించారు. నిందితుడు బాబూరెడ్డి కుడి మణికట్టు దగ్గర వాపు ఉందని చెబితే మాత్ర ఇచ్చామని, అయినా నొప్పి ఉందని కట్టు కట్టించుకున్నారని, కంప్రెషన్ బ్యాండేజీ లేకపోవడంతో రక్త గాయాలకు కట్టే బ్యాండేజ్ ను కట్టినట్టు వైద్యాధికారి రోజా చెప్పడం గమనార్హం.