
ఆగిన పెళ్లి.. యువకుడిపై కేసు నమోదు
రాప్తాడు రూరల్: నేడు, రేపు (శనివారం, ఆదివారం) పెళ్లి. ఇరు కుటుంబాల్లోనూ ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. ఇంతలో వరుడికి అందిన ఫోన్‌కాల్‌తో పెళ్లి కాస్త పెటాకులైంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామంలో ఓ యువతికి, మరో ప్రాంతానికి చెందిన యువకుడికి పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయమైంది. శనివారం ముహూర్తం, ఆదివారం తలంబ్రాలకు నిర్ణయించుకుని రెండు కుటుంబాల్లోనూ అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసుకున్నారు.
ఇంతలో మన్నీల గ్రామానికి చెందిన వివాహితుడైన బాలచంద్ర.. వరుడి ఫోన్ నంబరు సేకరించుకుని శుక్రవారం కాల్ చేశాడు. ‘నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయితో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. అలాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు. నీ ఇష్టం. కావాలంటే మేమిద్దం కలిసి ఉన్న ఫొటో కూడా పంపుతాను చూడు’ అంటూ ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటో పంపాడు. దీంతో పెళ్లికొడుకుతో పాటు వారి కుటుంబ సభ్యులు కంగుతిని పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయారు. దీంతో వధువు తరఫు కుటుంబసభ్యులు, బంధువులు లబోదిబోమంటూ ఇటుకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురి పెళ్లి చెడిపోవడానికి కారణమైన బాలచంద్ర కుటుంబ సభ్యులపై దాడి చేశారు.