గుజ్జు లాగేశారు! | Mango farmers of Totapuri face difficulties this year | Sakshi
Sakshi News home page

గుజ్జు లాగేశారు!

Oct 16 2025 6:06 AM | Updated on Oct 16 2025 6:06 AM

Mango farmers of Totapuri face difficulties this year

మామిడి విక్రయాల్లో మాయాజాలం

ర్యాంపుల్లో గోల్‌మాల్‌ 

బినామీ పేర్లతో కాయలు తోలినట్లు లెక్కలు  

పరిశీలనలో తేలని అక్రమాలు    

ఫ్యాక్టరీ ఇవ్వాల్సిన రూ.8పై నిలదీస్తున్న రైతు నాయకులు  

ఏడాది పాటు చెమటోడ్చి కష్టించే మామిడి రైతులంటే అందరికీ అలుసుగా మారింది. తోతాపురి మామిడి రైతులను ఈ ఏడాది ఎన్నడూ లేనన్ని కష్టాలు చుట్టుముట్టాయి. పంట విక్రయం ద్వారా వచ్చే సొమ్ముతో కుటుంబ అవసరాలు, చేసిన అప్పులు తీర్చుకుందామనుకున్న కర్షకుల ఆశలు అడియాశలయ్యాయి. తోతాపురి విక్రయంలో అన్ని దశల్లోనూ పుడమి పుత్రులు దగా పడ్డారు. 

కాణిపాకం: మామిడి కాయల విక్రయంలో బినామీ లెక్కలకు రెక్కలొచ్చాయి. అక్రమాలు పరిశీలన పక్కదారి పట్టింది. అసలు లెక్కలను అధికారులు తోసిపుచ్చారు. బోగస్‌ లెక్కలను తేల్చలేకపోయారు. తద్వారా ప్రభుత్వం అందించిన మామిడి ప్రోత్సాహక నిధి రూ.4 చెల్లింపు దుర్వినియోగమైందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. రా యితీ పోయినా ఫ్యాక్టరీ చెల్లించాల్సిన రూ.8 కోసం రోడ్డెక్కారు. రైతు సంఘం నేతల గొంతు నొక్కేందుకు కొందరు ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి అవకతవలను నివారణకు జిల్లా యంత్రాంగం ముందుకు వచ్చి కాయలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తోతాపురి కిలో రూ.12 గిట్టుబాటు ధరను ప్రకటించింది. ఫ్యాక్టరీలు కిలో రూ.8 చెల్లించేలా, ప్రభుత్వం ప్రోత్సాహక నిధి కింద రూ.4 చెల్లిస్తామని వెల్లడించింది. అయితే కాయల విక్రయానికి టోకెన్ల పద్ధతి ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలో రాయితీపై కన్నేసిన కొందరు అక్రమాలకు తెగబడ్డారు.  

మధ్యవర్తుల దందా.. 
మామిడి కొనుగోలు సమయంలో ఫ్యాక్టరీల వద్ద కొందరు కాపు కాచారు. కూటమి నేతలు, ప్రజాప్రతినిధుల పేరు చెప్పి టోకన్లను అమ్ముకున్నారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో పండిన కాయలను జిల్లాలోని ఫ్యాక్టరీలకు తరలించారనే వాదనలు వినిపించాయి. ఈ దోపిడీ జోరుగా సాగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై తమిళనాడు సరిహద్దులో నిఘా పెట్టారు. దీనికితోడు వ్యాపారులను బుట్టలో వేసుకుని కూటమికి చెందిన కొందరు ప్రభుత్వ ప్రోత్సాహక నిధి దోపిడీకి తెరలేపారు. 

ర్యాంపులను అడ్డం పెట్టుకుని కాయలు కాటా వేసి, బోగస్‌ పేర్లు, బిల్లులు సృష్టించారు. ఇలాంటివి బంగారుపాళెం, కుప్పం, వి.కోట, పలమనేరు, సోమల తదితర ప్రాంతాల్లో జరిగినట్లు విమర్శలు వచ్చాయి. అలాగే నీలం కాయలను కూడా ర్యాంపులకు తరలించి తోతాపురి లెక్కల్లోకి ఎక్కించారని ఆరోపణలు భగ్గుమన్నాయి. దీనిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రపంచ మామిడి దినోత్సవ సభలో భగ్గుమన్నారు. బోగస్‌ లెక్కలను బయటకు తీస్తామని సభ సాక్షిగా హామీ ఇచ్చారు. అయితే అధికారులు పరిశీలన పేరుతో జాప్యం చేసి తమ చేతులు దులుపుకున్నట్లు తెలిసింది. ర్యాంపుల వద్ద లెక్కలు గందరగోళంగా ఉండడంతో ఏం చేయలేక మిన్నకుండిపోయినట్లు సమాచారం.  

రూ.8 మాటేంటీ..
ప్రభుత్వం తోతాపురికి ప్రకటించిన మద్ధతు ధర విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. రూ.4 ప్రోత్సాహక నిధి చెల్లించి..చేతులు దులుపుకుంటోంది. అయితే ఫ్యాక్టరీ నుంచి కిలో రూ.8 ఇవ్వాల్సి ఉండగా..దీనిపై నోరువిప్పడం లేదు. ఇది వరకే కొన్ని ఫ్యాక్టరీలు కిలో రూ.5 చెల్లించగా రైతులు భగుమంటున్నారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా రైతు సంఘ నాయకులు అక్రందన సభ నిర్వహణకు సిద్ధపడ్డారు. 

బుధవారం బంగారుపాళెం మండలంలోని మార్కెట్‌యార్డులో సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కూటమికి చెందిన నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి రైతుల సంఘం నాయకులకు బెదిరింపులు వస్తున్నాయి. సభను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్ధతు ధరపై పోరాడుతున్న రైతు నాయకులను అడ్డుకుంటే భవిష్యత్‌ ఉండదని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

నిధి మంజూరుతో ఇలా.. 
అధికారులు పరిశీలన పూర్తి చేసి ఇచ్చిన నివేదికలపై రైతులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి చిత్తూరుజిల్లా వ్యాప్తంగా 31,929 మంది రైతులు 79,963 సార్లు కాయలు తరలించగా 3.67లక్ష టన్నుల కాయలు విక్రయించినట్లు లెక్కకట్టారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.146 కోట్ల మేర నిధులు మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ చెల్లింపులపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోగస్‌ లెక్కలు తేల్చకుండా నిధులు జమ చేయడంపై మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

ఇలా అమ్మకాలు..
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది తోతాపురి రకం 39,895 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు కాగా 4.99 లక్షల టన్నుల కాయలు దిగుబడి వచ్చినట్లు అధికారుల అంచనా వేశారు.   మొత్తం 43 ఫ్యాక్టరీలుండగా 31 ఫ్యాక్టరీలు కాయల కొనుగోలు చేశాయి. ఈ ఫ్యాక్టరీ లు 49,350 మంది రైతుల నుంచి 2.31 లక్షల మెట్రిక్‌ టన్నుల కాయలను కొనుగోలు చేయగా.. 25 ర్యాంపులు 30,600 మంది రైతుల నుంచి 1.44 లక్షల మెట్రిక్‌ టన్నుల కాయలను కొనుగోలు చేసినట్లు అధి కారులు అప్పట్లో నివేదికలిచ్చారు. 

బోగస్‌ లెక్కలు తేల్చాలి 
కొన్ని ర్యాంపుల్లో ప్రభుత్వ నిధిని దోచుకోవాలని బోగస్‌ లెక్కలు చూపించారు. ఆ లెక్క­లు తేలకుండా నిధి జమ చేశారు. దీంతో ప్రజానిధి పక్కదారి పట్టిందని భావిస్తున్నాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఆ బోగస్‌ లెక్కలు తేల్చాలి. అలాగే ఫ్యాక్టరీలు కిలోకు రూ.8 ఇవ్వాలి. ఇందుకు అన్ని పార్టీలను సమన్వయం చేసుకుని సభకు పూనుకున్నాం.        – ఉమాపతినాయుడు, మామిడి రైతు సంఘ ఉపాధ్యక్షులు 

ఫ్యాక్టరీల నుంచి రూ. 8 ఇప్పించాలి  
ప్రభుత్వం తోతాపురికి మద్ద తు ధరగా కిలో రూ.12 ప్రకటించింది. ఆ ప్రకారమే రైతు లకు నగదు ఇప్పించాలి. ఫ్యా క్టరీలు కేజీకి రూ. 5 ఇస్తే ఒప్పకోం. కచ్చితంగా రూ.8 ఇవ్వా ల్సిందే. ఇవ్వని ఫ్యాక్టరీ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈనేపథ్యంలోనే బంగారుపాళ్యంలో అక్రందన సభను నిర్వహిస్తున్నాం. ఈ సభను అడ్డుకోవద్దు. మేము రైతుల కోసం పోరాడుతున్నాం. ఇందుకు అందరు సహకరించాలి.    – జనార్దన్, మామిడి రైతు సంఘ అధ్యక్షులు  

ఇంకా చేయాల్సింది ఉంది  
మామిడి కొనుగోలుపై పరిశీలన చేపట్టాం. పరిశీలనలో చాలా వరకు తీసేశాం. ఇంకా పరిశీలన చేయాల్సి ఉంది. చేస్తాం. ఏదైనా అనుమానం ఉంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. కచ్చితంగా స్పందిస్తాం. చర్యలు తీసుకుం టాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. అనుమానాలు వద్దు.   – మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, చిత్తూరు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement