
సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్‌కు యూరియా సెగ తగిలింది. యూరియా కోసం రైతుల కష్టాలపై చర్చ జరిగింది. యూరియా విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందంటూ కేబినెట్‌లో చర్చ నడిచింది. యూరియా అంశంపై ఎదురుదాడి చేయాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. మంత్రులంతా వైఎస్సార్‌సీపీని తిట్టాలని సీఎం ఆదేశించారు.
కాగా, యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్‌లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా ‘కట్ట’ దొరకడం కష్టంగా మారింది.
యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్‌కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కారు చేతులెత్తేసింది.