AP: ‘యూరియా’పై హ్యాండ్సప్‌! | We have failed in urea supply says Chandrababu at Collectors Conference | Sakshi
Sakshi News home page

AP: ‘యూరియా’పై హ్యాండ్సప్‌!

Sep 16 2025 5:12 AM | Updated on Sep 16 2025 6:50 AM

We have failed in urea supply says Chandrababu at Collectors Conference

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం వడ్డితాండ్రలో యూరియా కోసం బారులుదీరిన రైతులు

సరఫరాలో విఫలమయ్యాం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు 

మానవ తప్పిదమే.. ప్రణాళిక సరిగ్గా అమలు చేయలేదు

ఏ రైతుకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటే సమస్యలు వచ్చేవి కావు 

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా యూరియా వినియోగాన్ని తగ్గించాలి 

ఈ ఏడాది సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయలేదు 

భూసార పరీక్షలూ నిర్వహించలేదు.. 

ఉల్లి, టమాటా రైతులు రోడ్డు ఎక్కకుండా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలి 

ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోతే విద్యుత్‌ సబ్సిడీ కట్‌.. నెలే గడువు 

ఈ ఏడాది 17.11 శాతం వృద్ధి సాధించాలి.. కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత: సీఎం

కొరతలేదు.. న్యూసెన్స్‌ చేస్తే బొక్కలో పెట్టి పనిష్‌ చేస్తా
ఏ రైతుకూ యూరియా కొరత రానివ్వకుండా చూసే బాధ్య­త నేను తీసుకుంటా. ఎక్కడైనా ఎరువులు లేవంటే నేనే అక్కడకు వెళ్తా! కావాలని న్యూసెన్స్‌ చేస్తే తీసుకెళ్లి బొక్కలో పెట్టి పనిష్‌ చేస్తా.. మీరు రాజకీయాల్లో భాగస్వాములు కావద్దు.. రైతులు రైతులుగా ప్రవర్తించండి! డ్రామాలు ఆడితే ఈ ప్రభుత్వమంటే ఏమిటో చూపిస్తాం..     
– ఇటీవల సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు 

ఔను.. యూరియా పంపిణీలో విఫలమయ్యాం.. 
రైతులకు యూరియా సరఫరాలో వైఫల్యం చెందాం.. ఇది మానవ తప్పిదమే. ప్రజల ఆరో­గ్యం దృష్ట్యా యూరియా వినియోగాన్ని తగ్గించాలి. భూసార పరీక్షలు నిర్వహించ లేదు.. రైతులకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదు.. వ్యవసాయ అవ­సరాలకు సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు.. ఇప్పుడు ఉల్లి, టమాటా ధరలు పడిపోయాయి.. ఈ సమయంలో రైతులు రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలి.   
 – కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: రైతులకు యూరియా సరఫరా చేయడంలో వైఫల్యం చెందామని, ఇది మానవ తప్పిదమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వ్యవసాయ అవసరాలకు సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. భూసార పరీక్షలు నిర్వహించలేదని, రైతులకు అవసరమైన సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని సీఎం అంగీకరించారు. 

ఏ రైతుకూ యూరియా కొరత రానివ్వకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని, ఎక్కడైనా ఎరువులు లేవంటే తానే స్వయంగా అక్కడకు వెళ్తానని గతంలో ప్రకటించిన చంద్రబాబు తాజాగా యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఎట్టకేలకు కలెక్టర్ల సదస్సు సాక్షిగా ఒప్పుకోవడం గమనార్హం. 

సాగు వివరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోని ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీని నిలుపుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీసు రంగాల్లో వృద్ధి లక్ష్యాలపై ప్రజెంటేషన్‌ అనంతరం కలెక్టర్లు వివిధ సమస్యలను ప్రస్తావించిన సమయంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

ముందు జాగ్రత్తలు తీసుకోలేదు..
యూరియా సరఫరాలో వైఫల్యం మానవ తప్పిదమే అవుతుందని సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడేవి కావని, కరెంట్‌ ఉండేది కాదని, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం అసెంబ్లీని వాయిదా వేసుకుని పోయేదన్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవని, అయితే రైతులకు యూరియా సరఫరా విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు. యూరియా సరఫరా విషయంలో ప్రణాళిక సరిగా అమలు చేయలేదన్నారు. ఈ విషయంలో వైఫల్యం చెందామన్నారు. ఏ రైతుకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటే సమస్యలు వచ్చేవి కావన్నారు. 

భూసార పరీక్షలు.. పోషకాల పంపిణీ లేదు 
ఈ ఏడాది భూసార పరీక్షలు నిర్వహించలేదని, రైతులకు అవసరమైన సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక నుంచి ముందుగా భూసార పరీక్షలు చేసి అవసరమైన సూక్ష్మ పోషకాలు ఇవ్వాలని సూచించారు. యూరియాను ఎక్కువగా వినియోగిస్తే కేన్సర్‌ జబ్బుల్లో తొలి ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ మొదటి స్థానానికి వెళ్తుందని చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో పంజాబ్‌ను కేస్‌ స్టడీగా తీసుకోవాలన్నారు. 

ప్రజా­రోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగాన్ని తగ్గించాలన్నారు. ఆ దిశగా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం వినియోగిస్తున్న యూరియాలో ఒక బస్తా తగ్గించే రైతులకు రూ.800 చొప్పున ప్రోత్సాహకం ఇస్తామన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గిస్తే పీఎం ప్రణామ్‌ కింద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం 50 శాతం సబ్సిడీ ఇస్తుందని, ఆ మొత్తాన్ని యూరియా వాడకం తగ్గించే రైతులకు ఇస్తామని చెప్పారు. త్వరలోనే విధి విధానాలను ప్రకటిస్తామని సీఎం చెప్పారు. 


ఉల్లి, టమాటా రైతులు రోడ్డెక్కకుండా చూడాలి..
రసాయన ఎరువుల కారణంగా మన మిరపను చైనా తిరస్కరించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. యూరప్‌ దేశాల్లో మన ఉత్పత్తులకు ధర తగ్గిస్తున్నారన్నారు. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయన్నారు. ప్రజలు తినే వెరైటీలనే పండించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని, లేదంటే ఉత్పత్తులను కొనేవారు ఉండరన్నారు. డిమాండ్, సరఫరాకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులను చైతన్యపరచడంలో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు. 

పొగాకు కొనుగోలు చేశామని, ఈ ఏడాది పంట హాలిడే ఇచ్చామ­న్నారు. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా ధరలు పడిపోయాయని, ఈ సమయంలో రైతులు రోడ్డు మీద పడకుండా వారి ఇబ్బందులను తగ్గించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కడప నుంచి రైతులు టమోటా తీసుకురావాలంటే రవాణా ఖర్చు ఎక్కువ అవుతుందని వదిలేస్తున్నారని, అలా కాకుండా రవాణా చార్జీలను ప్రభుత్వం భరిస్తుందన్నారు. 

పట్టణ నియోజకవర్గాలను మినహాయించి మిగతా 157 చోట్ల పశువుల హాస్టళ్లను చేపట్టాలని సూచించారు. గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటర్న్‌∙గిఫ్ట్‌ ఇస్తుందన్నారు. జీఎస్‌డీపీ వృద్ధిలో పశు సంపద పాత్ర కీలకమన్నారు. దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేయాలని సూచించారు.

రిజిస్ట్రేషన్‌ చేసుకోకుంటే ఆక్వాకు విద్యుత్‌ సబ్సిడీ కట్‌
సాగు వివరాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోని ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీని నిలిపేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికి 30 శాతం మందే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, మిగతా వారు కూడా నెల రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, లేదంటే యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50 సరఫరాను నిలుపుదల చేస్తామన్నారు. ఈ విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా రైతుల్లో క్రమశిక్షణ అవసరమన్నారు. కాలుష్యం పెరిగి ఆక్వా ఉత్పత్తులు దెబ్బ తింటే కొనేవారు ఉండరని సీఎం పేర్కొన్నారు.

కోనసీమ కంటే ‘అనంత’ తలసరి ఆదాయం అధికం..
కోనసీమ కంటే అనంతపురం తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ ఎక్కువగా ఉందని సీఎం చెప్పారు. ఇందుకు ఉద్యాన పంటలే కారణమన్నారు. వివిధ వాణిజ్య, ఉద్యాన పంటల కారణంగా ఆయిల్‌ పామ్‌ ఉమ్మడి గోదావరి జిల్లాలకు గేమ్‌ ఛేంజర్‌గా మారిందన్నారు. ఏజెన్సీలో కాఫీ కంటే మిరియాలు ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నాయన్నారు. 

ఫెయిల్‌.. పాస్‌ మంత్రులకూ వర్తిస్తుంది 
ఈ ఆర్థిక ఏడాది వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో ఎవరు ఫెయిల్‌? ఎవరు పాస్‌? అనేది డేటా ప్రకారం తేలుతుందని, ఇది కలెక్టర్లతోపాటు మంత్రులకూ వర్తిస్తుందని సీఎం స్పష్టంచేశారు. వ్యవ­సాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఈ ఏడాది 17.11 శాతం వృద్ధి సాధించాలన్నారు. 

విధాన­పరమైన నిర్ణయాలు తీసుకునే వారి నుంచి మంత్రులు, కలెక్టర్లు గ్రామ కార్యదర్శి వరకు వృద్ధి సాధనలో పాత్ర పోషించాలన్నారు. విమానాశ్ర­యాలు, పోర్టులు, పర్యాటక ప్రాజెక్టుల వద్ద ఎకో సిస్టం రూపొందించాలన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలు అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement