సాక్షి, అన్నమయ్య జిల్లా: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. రైతుల గురించి చంద్రబాబు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులు బాగుంటే అన్నీ బాగుంటాయి.. కానీ, కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రైతులు రాష్ట్రంలో చాలా మేర పంటలు సాగు చేయనే లేదు. అన్నమయ్య జిల్లాలో కనీసం పది శాతం కూడా పంటల సాగు జరగలేదు. మామిడి రైతులకు చంద్రబాబు డబ్బు ఇచ్చాను అంటాడు.. కానీ ఎవరికిచ్చాడో చెప్పడు. సాగు చేసిన ఏ పంటకూ కనీస గిట్టుబాటు ధర ఎక్కడా లేదు. అన్నదాత సుఖీభవ మొదటి ఏడాది ఎగ్గొట్టాడు. 20వేలు ఒకే సారి ఇస్తానన్నాడు.. అదీ విడుతల వారీగా ఇస్తున్నాడు. రైతులు బాగుంటే అన్నీ బాగుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం రైతు బాగుకోసం చూడటం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇంతవరకూ ఒక్క ఎకరాకు కూడా ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయాడు. గతంలో వైఎస్ జగన్ బీమా ప్రీమియం కూడా చెల్లించారు. ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో ఇన్ పుట్ సబ్సిడీ, పరిహారం అందించారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
నేడు రాయచోటిలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే కబ్జా చేసేస్తున్నారు. పోలీసులు పూర్తి బాధ్యతా లోపంతో వ్యవహరిస్తున్నారు. ప్రజల భూములను లాగేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇంకా ఎంతకు దిగజారుస్తారు?. ప్రభుత్వ, ప్రైవేటు అని లేకుండా కనిపించిన ప్రతి ఒక్క భూమినీ కబ్జా చేసేస్తున్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదంటారు. మదనపల్లి మెడికల్ కాలేజీపై కూడా అదే రీతిలో కుట్రలు చేస్తున్నారు. కల్తీ మద్యం కేసు ఏమైందో ఇంతవరకూ స్పష్టత లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.


