
కాయల కాసులు కొట్టేశారా?
ఖరీఫ్‌లో జిల్లాకు 30,228 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు
విత్తనాల విలువ రూ.28.16 కోట్లు
రాయితీ పోను అసలు మొత్తం రూ.16.69 కోట్లు
ప్రస్తుతం రూ.50 లక్షల వరకు
బకాయిలు
నెలలు గడుస్తున్నా తిరిగి చెల్లించని వ్యవసాయశాఖ
కూటమి నేతల చేతుల్లో
ఇరుక్కుపోయిందంటున్న సిబ్బంది
పట్టించుకోని జిల్లా అధికారులు
చిత్తూరు రూరల్(కాణిపాకం): వేరుశనగ విత్తన కాయల సొమ్మును వాడేసుకున్నారు. రూ.28.16కోట్ల విలువ చేసే కాయలు సొమ్ములో కొంతమేర దారిమళ్లిచారు. కాయలు విక్రయించిన రైతు భరోసా సిబ్బంది ఇష్టానుసారంగా వాడేశారు. నెలలు గడుస్తున్నా నగదు చెల్లింపులో జాప్యం చేస్తున్నారు. ప్రస్తుతం రూ.50 లక్షల వరకు చెల్లింపులు పేరుకుపోయాయి. కొంత సొమ్ము కూటమి నేతల చేతుల్లో ఇరుక్కుపోయిందని సిబ్బంది మదనపడుతున్నారు. దీనిపై జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
లక్షల్లో చెల్లించాలి
జిల్లాకు సరఫరా చేసిన విత్తన రాయితీ ధర రూ.11.27కోట్లు పోను రూ.16.69కోట్లు రైతు భరోసా కేంద్ర సిబ్బంది ఏపీ సీడ్స్‌కు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ఈ ఏడాది జూన్ 2 నుంచి 20వ తేదీ వరకు వేరుశనగ విత్తన కాయలను పంపిణీ చేశారు. కాయలు పంపిణీ చేసిన వెంటనే రైతుల దగ్గర నుంచి కూడా నిర్ణీత ధరను వసూలు చేశారు. అయితే వసూళ్లు చేసిన విత్తన నగదును ఎప్పటికప్పుడు ఏపీసీడ్స్ ఖాతాకు జమచేయాలి. కానీ పలువురు సిబ్బంది ఆ నగదును జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నట్టు తెలుస్తోంది. 15 రోజుల క్రితం వరకు రూ.1.50 కోట్ల వరకు చెల్లించాలని తెలిసింది. వారం క్రితం రూ.70 లక్షలు ఉన్నట్లు అధికారులు లెక్కలుగట్టారు. ఇప్పుడు రూ.50లక్షల వరకు చెల్లించాల్సి ఉందని అంటున్నారు.
ఇచ్చేశారు..ఇరుక్కుపోయారు
కాయలు ఇచ్చే బాధ్యతల్లో కూటమి నేతలు సైతం పాలు పంచుకున్నారు. వారి కనుసన్నల్లోనే విత్తన కాయలను పంచారు. దగ్గరుండి కాయల పంపిణీని పూర్తిచేశారు. చివరకు కొంతమంది నేతలు అప్పు పేరుతో కాయలు దండుకున్నారు. చాలా మంది నగదు చెల్లించలేదని సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఇక కొంతమంది సిబ్బంది ఇష్టానుసారంగా విత్తన కాయల నగదును వాడేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీడీనెల్లూరు, వీకోట, పలమనేరు, పుంగనూరు, కుప్పం, చిత్తూరు తదితర మండలాల్లో ఈ బకాయిలున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో పలు మండలాల వ్యవసాయశాఖ అధికారులకు కూడా సంబంధాలున్నాయి. సర్దుబాటుతో ఈ నగదును సిబ్బంది చేతి నుంచి మండల వ్యవసాయశాఖ అధికారులు వాడేసుకున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు షోకాజ్ నోటీసులిచ్చి నెట్టుకొస్తున్నారు. కూటమినేతలు అప్పు తీసుకోవడంతో కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు వరకు నోరు మెదపని పరిస్థితి ఉంది. కానీ అధికారులు కూటమి కాయల కథను దాచి పెడుతున్నారు. బదిలీల సమయంలో నో డ్యూస్, నో చార్జ్ పత్రాలు ఇస్తేనే బదిలీలకు అవకాశం కల్పించారు. అలాంటప్పుడు ఈ బకాయిలు ఎలా ఉండిపోయాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వేరుశనగ విత్తనాలు
అప్పు తీసుకున్నారు
చాలా చోట్ల కాయలను అప్పు తీసుకున్నారు. బదిలీల వల్ల కొన్ని చెల్లింపుల్లో ఆలస్యమైంది. ఎవరైతే చెల్లించలేదో వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చాం. రికవరీ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో చేయిస్తాం. చెల్లించని వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి. – మురళీకృష్ణ,
జిల్లా వ్యవసాయశాఖఅధికారి, చిత్తూరు
ఇదీ ఖరీఫ్ లెక్క
ఖరీఫ్ దృష్ట్యా జిల్లాకు ఈ సారి 30,283 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలు సరఫరా అయ్యాయి. వీటి ధర రూ.28.16 కోట్లు. ప్రభుత్వం రాయితీతో ఈ విత్తనాలను జిల్లాకు అందించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ బాధ్యతలను రైతు భరోసా కేంద్ర పరిధిలో పనిచేసే వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బందికి అప్పగించారు. వారు ఆ కాయలను రైతులకు విక్రయించి సొమ్మును ఏపీసీడ్స్‌కు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ చెల్లింపులో కొందరు సిబ్బంది మాయ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాయల కాసులు కొట్టేశారా?

కాయల కాసులు కొట్టేశారా?