అపోలో యూనివర్సిటీలో నిరీక్షిస్తున్న వెరిఫికేషన్ కు విచ్చేసిన అభ్యర్థులు, కుటుంబీకులు
చిత్తూరు కలెక్టరేట్ : మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నిర్వహించిన ఈ కసరత్తు రెండు రోజుల పాటు సాగింది. చిత్తూరు జిల్లా కేంద్రానికి సరిహద్దులో ఉన్న అపోలో యూనివర్సిటీ, ఆర్‌వీఎస్ నగర్‌లో ఉన్న ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్లను తనిఖీ చేశారు. ఈ ప్రక్రియలో 1,478 మందికి గాను 1,394 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. మిగిలిన 84 మంది అభ్యర్థులు టీజీటీ, పీజీటీ కేడర్లు కావడంతో వైఎస్సార్ కడపలో పరిశీలన చేస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అపోలో యూనివర్సిటీలో చిత్తూరు డీఈవో వరలక్ష్మి, ఎస్వీ సెట్‌లో కేవీఎన్ కుమార్ పర్యవేక్షణలో సర్టిఫికెట్ల పరిశీలన కసరత్తు సాగింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టిన అభ్యర్థులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వారి వివరాలను సైతం నివేదికల్లో నమోదు చేసుకున్నారు. ఈ ప్రక్రియలో ఫేక్ సర్టిఫికెట్‌లు, గైర్హాజరు అయిన అభ్యర్థుల స్థానంలో మరో జాబితాను రూపొందించి సెప్టెంబర్ 1వ తేదీన ప్రచురిస్తారని తెలిసింది. ఇదిలావుండగా పీహెచ్ (దివ్యాంగులు) కేటగిరీలో దాదాపు 50 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు. ఈ కేటగిరీలో కొంతమంది అభ్యర్థులు తప్పుడు సర్టిఫికెట్‌లు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
అపోలో యూనివర్సిటీలో సర్టిఫికెట్‌ల పరిశీలన..
ముగిసిన పరిశీలన