
పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం
చౌడేపల్లె: పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ ఘటన చౌడేపల్లె మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని పెద్దయల్లకుంట్లకు చెందిన లీలావతి అలియాస్ నాగవేణి(48) భర్త మూడేళ్ల క్రితం మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె పుట్టినిల్లు అయిన పెద్దయల్లకుంట్లలోనే నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు సుబ్రమణ్యం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు హరీష్ ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె ఎప్పుడూ తనకు తానే నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ వేళ్లేదని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం గ్రామానికి సమీపంలోని పొలం వద్దకు వెళ్లి శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది చంద్రశేఖర్, హరిప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన నాగవేణిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది.
చోరీ కేసులో ముగ్గురికి జైలు
చిత్తూరు అర్బన్: ఓ ఇంట్లో చోరీ చేసిన కేసులో హేమచంద్ర (28), సురేష్ (27), వరప్రసాద్ (20) అనే ముగ్గురు నిందితులకు ఆర్నెళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికీ రూ.వెయ్యి జరిమానా విధిస్తూ చిత్తూరులోని మూడో అదనపు జూనియర్ సివిల్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వాతి కథనం మేరకు.. ఈ ఏడాది జనవరి 8వ తేదీన చిత్తూరు మండలం, చెర్లోపల్లెకు చెందిన తేజ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి 30 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసి తాలూక పోలీసులు కాణిపాకంకు చెందిన హేమచంద్ర, ప్రకాశం జిల్లాకు చెందిన సురేష్, సత్యసాయి జిల్లాకు చెందిన వరప్రసాద్ అనే ముగ్గురు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితులపై నేరం రుజువు కావడంతో వారికి ఆర్నెళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శిరీష తీర్పునిచ్చారు.
నారాయణ కళాశాల భవన నిర్మాణ పనుల్లో కార్మికుడి మృతి
రేణిగుంట : మండలంలోని విప్పమానుపట్టెడ గ్రామ సమీపంలోని తుడా లేఅవుట్‌లో నారాయణ విద్యాసంస్థలకు చెందిన నూతన భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుడు అన్సర్ హేహమన్ (19)నాలుగో అంతస్తు నుంచి జారి కిందపడి శుక్రవారం మృతి చెందాడు. గాజుల మండ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.