
చంద్రబాబు సభకు రావాలంటూ మహిళా సంఘాలకు అధికారుల బెదిరింపులు
ప్రతీ గ్రూప్ నుంచి పదిమంది రావాల్సిందేనంటూ వాయిస్ మెసేజ్‌లు
రానివారి పేర్లు రాసిచ్చేస్తామంటుండడంతో మహిళలు బెంబేలు
ఏడాదిలో చిత్తూరుకు హంద్రీ–నీవా.. 60 ఏళ్లు నిండిన మహిళలకు ఏ గుడికైనా వెళ్లేందుకు ఉచిత బస్సు: సీఎం చంద్రబాబు
కుప్పం: ‘అక్కా.. ఆ పని ఉంది, ఈ పని ఉందని చెప్పి ముఖ్యమంత్రి కార్యక్రమానికి రాకుండా ఉంటే కుదరదు. ప్రతి గ్రూపు నుంచి పది మంది రావాల్సిందే. రాని వారి పేర్లు, వారి గ్రూపు పేర్లు రాసిచ్చేస్తా. ఎందుకంటే అన్నీ మేమే పెట్టాలని ఫోర్స్ చేస్తున్నారు. వచ్చిన వారి ఫొటోలు టాబ్‌లో ఎక్కిస్తాను. రాని వారి పేర్లు రాసుకుంటాను’.. అంటూ అధికారులు మహిళా సంఘాలకు వాయిస్ మెసేజ్‌లు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో తమకు ప్రభుత్వ పథకాలు ఎక్కడ నిలిపేస్తారేమోనని మహిళలు ఆందోళనకు గురై సీఎం సభకు హాజరయ్యారు.
ఇదీ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో చోటుచేసుకున్న ఘటన. ఇక కుప్పం మండలం, పరమసముద్రం చెరువు వద్ద హంద్రీ–నీవా నీటి విడుదల సందర్భంగా సీఎం జలహారతి ఇచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ.. ఏడాదిలోగా చిత్తూరుకు హంద్రీ–నీవా నీరిస్తామని, దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయని ఆయన తెలిపారు. హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ద్వారా వస్తున్న 40 టీఎంసీల నీటితో 85% రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయన్నారు.
ప్రాజెక్టు రెండు దశల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. ఈ సీజన్‌లో గోదావరి నుంచి 1,600 టీఎంసీలు, కృష్ణానది నుంచి 600 టీఎంసీల వరద జలాలు కడలి పాలయ్యాయని.. నదుల అనుసంధానం జరిగితే కరువు అనేది ఉండదన్నారు. తెలంగాణ కూడా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటే తెలుగు జాతికి తిరుగుండదన్నారు.
రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదేనని చెప్పారు. ‘సీమ’ అభివృద్ధికి బ్లూప్రింట్ సిద్ధం చేసుకున్నానన్నారు. 2014–19 కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం తాను రూ.12,500 కోట్లు ఖర్చుచేస్తే తరువాత వచ్చిన ప్రభుత్వం ఐదేళ్లలో రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేసిందన్నారు. ఇక వరి సాగు వద్దని.. దానివల్ల ఆదాయం లేనందున వాణిజ్య పంటలపై దృష్టిసారించాలని ఆయన సూచించారు.
పులివెందుల, ఒంటిమిట్టలో రప్పారప్పా..
కుప్పంలో వైఎస్సార్‌సీపీ రప్పారప్పా రాజకీయం చేయాలని చూస్తే, పులివెందుల, ఒంటిమిట్టలో అక్కడి ప్రజలు రప్పారప్పా రాజకీయం చూపెట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం యజ్ఞంలా తాను ముందుకుపోతుంటే కొందరు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణించి వారితో మాట్లాడారు. 60 ఏళ్లు నిండిన మహిళలు ఉచిత బస్సు ఎక్కి ఏ గుడికైనా వెళ్లేలా, అలాగే అన్న క్యాంటీన్‌లో ఉచితంగా భోజనంచేసి వచ్చే ఏర్పాట్లుచేస్తామన్నారు. ఆటో డ్రైవర్లతో కూడా ఆయన మాట్లాడారు.