
తమకు న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్న బాధితులు
సహకరిస్తున్న ఉపాధ్యాయురాలు
కులం పేరుతో దూషిస్తూ దాడులు
ఇళ్లు ఖాళీ చేయకుంటే చంపేస్తామని బెదిరింపులు
శ్రీరంగరాజపురం: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని శ్రీరంగరాజపురం ఎర్రికొంట వద్ద పేదలు నిర్మించుకున్న ఇళ్ల స్థలాలపై కూటమి నాయకులు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కన్నుపడింది. స్థానికుల కథనం మేరకు.. దళితులకు ఇంటి స్థలాలు లేకపోవడంతో 10 కుటుంబాలు ఎర్రికొంట వద్ద గుడిసెలు వేసుకుని 20 ఏళ్లుగా జీవిస్తున్నాయి. ఈ భూమిపై ప్రభుత్వ ఉపాధ్యాయురాలు దీనవతి, టీడీపీ నేత ఎత్తిరాజులునాయుడు కన్నుపడింది. వీరు జేసీబీతో 20 మంది కూటమి నాయకులతో కలిసి శుక్రవారం రాత్రి దళితులు నిర్మించుకున్న ఇళ్లను ధ్వంసం చేయడానికి యత్నించారు.
దళితులు అడ్డుకోవడంతో వారిపై దాడులకు దిగారు. కులం పేరుతో దూషించారు. రేపటిలోగా ఇళ్లు ఖాళీ చేయకుంటే నిద్రలోనే చంపేస్తామని బెదిరించారు. తమకు వారి నుంచి ప్రాణహాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని స్థానిక పోలీసు స్టేషన్, తహశీల్దార్‌కు దళితులు ఫిర్యాదు చేశారు. గతంలో తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అగ్రవర్ణానికి చెందిన కూటమి నాయకులు అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఆత్మహత్యలే గతి అని ఆవేదన వ్యక్తం చేశారు.