
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్.. జొమాటో కొత్త ఫీజును వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. నష్టాలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 4 కి.మీ కంటే ఎక్కువ దూరం డెలివరీ చేసే ఫుడ్ ఆర్డర్‌ల కోసం ''లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు'' పేరుతో అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది.
150 రూపాయల కంటే ఎక్కువ విలువైన ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు.. బుక్ చేసుకునే హోటల్/రెస్టారెంట్ దూరం 4 నుంచి 6 కి.మీ మధ్య ఉంటే రూ. 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ దూరం ఉంటే.. దూరాన్ని బట్టి అదనపు ఛార్జీ (రూ. 25, రూ. 35) మారుతుంది. ఈ ఛార్జీ మీరు ఎంత ధరకు ఫుడ్ బుక్ చేసుకున్నారు అనేదాని మీద ఆధారపడి ఉండదు.
కోవిడ్-19 కి ముందు, జొమాటో 4-5 కి.మీ పరిధిలో ఉచిత డెలివరీని అనుమతించింది. మహమ్మారి తర్వాత, చాలా రెస్టారెంట్లు క్లోజ్ అయ్యాయి. దీంతో ఆ పరిమితిని 15 కి.మీ.లకు పొడిగించారు. తరువాత డెలివరీ ఫీజు వసూలు చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు దూరాన్ని బట్టి అదనపు ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి: గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా?
జొమాటో తీసుకున్న ఈ నిర్ణయం.. కస్టమర్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఛార్జీలను ఎప్పటికప్పుడు పెంచుతూ పోతుంటే.. ఫుడ్ కోసం ఖర్చు చేసే డబ్బుకంటే డెలివరీ కోసం చేసే ఖర్చు ఎక్కువవుతుందని కొందరు భావిస్తున్నారు. మొత్తం మీద జొమాటో నిర్ణయం వల్ల.. సంస్థ ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.