
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహవ్యవస్థాపకులు మోతీలాల్ ఓస్వాల్, రామ్‌దేవ్ అగర్వాల్ తాజాగా క్విక్‌కామర్స్ కంపెనీ జెప్టోలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. విడిగా 5 కోట్ల డాలర్లు(రూ.424 కోట్లు) చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెకండరీ లావాదేవీ ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వాటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించాయి. వీటి విలువ 10 కోట్ల డాలర్లు(రూ.848 కోట్లు)గా ఉంది.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరో 25 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న జెప్టో తాజా లావాదేవీ ద్వారా దేశీ యాజమాన్య వాటా పెంపువైపు సాగుతున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం దేశీ యాజమాన్యానికి కంపెనీలో 42% వాటా ఉంది. ఇతర లావాదేవీల ద్వారా ఐపీవో కంటే ముందే వాటాను 50%కిపైగా పెంచుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
2024 ఆగస్ట్‌లో సాధించిన 5 బిలియన్ డాలర్ల విలువలో లావాదేవీలు నమోదైనట్లు వెల్లడించాయి. కాగా.. మోతీలాల్ ఓస్వాల్ ఆధ్వర్యంలో ఎడిల్‌వీజ్, హీరో ఫిన్‌కార్ప్ తదితర సంస్థలు 25 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమకూర్చనున్నట్లు సమచారం. తదుపరి దశలో భాగంగా 25 కోట్ల డాలర్ల పెట్టుబడికి జూన్‌లో తెరతీయనున్నట్లు తెలుస్తోంది.