యూపీసీ వోల్ట్ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు
జీసీసీలు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ
డబ్ల్యూఈఎఫ్ వేదికగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు
సీఎం నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ పర్యటన విజయవంతం అయ్యిందన్న ప్రభుత్వ వర్గాలు
పెట్టుబడుల సాధన కన్నా‘రైజింగ్ 2047 విజన్’ లక్ష్యాలు చాటి చెప్పడంపై సర్కారు దృష్టి
మొత్తం 12 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్న సీఎం
ముగిసిన తెలంగాణ రైజింగ్ బృందం స్విట్జర్లాండ్ పర్యటన
జ్యూరిచ్ నుంచి అమెరికాకు ముఖ్యమంత్రి రేవంత్
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సును ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడు రోజుల పాటు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో జరిపిన చర్చలు, సంప్రదింపులు ఫల ప్రదంగా ముగిశాయి. రాష్ట్రంలో రూ.28,693 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటనలో ఆశించిన లక్ష్యాలను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘డబ్ల్యూఈఎఫ్–2026 సదస్సు’లో పెట్టుబడుల సాధన కంటే ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరినట్లు ప్రకటించాయి. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన విషయాన్ని గుర్తు చేశాయి.
పెట్టుబడులు.. కీలక ఒప్పందాలు
మూడు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సుస్థిర అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి డబ్ల్యూఈఎఫ్ నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారు. హెదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలంటూ సీఎం చేసిన ప్రతిపాదనపై డబ్ల్యూఈఎఫ్ వర్గాలు సానుకూలంగా స్పందించాయి.
స్వదేశానికి మంత్రులు
ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో జరిగిన 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలు కీలక సమావేశాలు, ప్రత్యేక సెషన్ల అనంతరం.. తెలంగాణ ప్రతినిధి బృందం మూడు రోజుల దావోస్ పర్యటన గురువారం సాయంత్రం ముగిసింది. దావోస్‌లో కార్యక్రమాలు ముంగించుకున్న ముఖ్యమంత్రి.. రోడ్డు మార్గంలో జ్యూరిచ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్తారు. తెలంగాణ బృందంలో సభ్యులుగా ఉన్న మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు.


