
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 2.1 కోట్లకు డిమాండ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించకపోతే అసెట్స్‌తో పాటు బ్యాంకు ఖాతాలు కూడా అటాచ్ అవుతాయంటూ హెచ్చరించింది. గీతాంజలి జెమ్స్ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల మీద 2022 జనవరిలో విధించిన జరిమానాను చోక్సీ చెల్లించకపోవడంతో ఈ నోటీసు జారీ అయింది.
గీతాంజలి జెమ్స్ సీఎండీ అయిన చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14,000 కోట్లు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018లో వారు దేశం నుంచి పరారయ్యారు. 2019లో బ్రిటన్‌లో అరెస్టయిన మోదీ ప్రస్తుతం అక్కడి జైల్లో ఉండగా, చోక్సీ బెల్జియంలో అరెస్టయ్యారు.
ఇదీ చదవండి: ఎస్‌బీఐ ఎఫ్‌డీ రేట్లలో కోత
ఇటీవల అరెస్ట్
భారత సీబీఐ అధికారుల కోరిక మేరకు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని ఇటీవల బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలున్నాయి. దాంతో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు గతంలో విశ్వప్రయత్నాలు చేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈమేరకు భారత్‌లోని ఉన్నతాధికారులకు లంచాలు కూడా ఇచ్చినట్లు గతంలో ఆరోపణలున్నాయి.