
దేశంలోనే దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల (0.20 శాతం) మేర తగ్గించింది. ఈ నిర్ణయం ఈ నెల 16 నుంచే అమల్లోకి వచ్చింది. బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం మేరకు.. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు కాలవ్యవధి డిపాజిట్లపై గరిష్టంగా 6.7 శాతం రేటు ఇకమీదట లభించనుంది.
మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్లపై రేటు 6.55 శాతం అమల్లోకి వచ్చింది. 5–10 ఏళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు సాధారణ ప్రజలకు 6.30 శాతానికి తగ్గింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు ఎఫ్‌డీలపై 6.5 శాతం రేటు అమలవుతుంది. అమృత్ వర్ష్(444 రోజుల డిపాజిట్)పై రేటు 7.05 శాతం నుంచి 6.85 శాతానికి తగ్గింది.
ఇదీ చదవండి: యాప్ ఒక్కటే.. సేవలు బోలెడు!
60 ఏళ్లు నిండిన, 80 ఏళ్లు నిండిన వృద్ధులకు ఎప్పటి మాదిరే వడ్డీ రేటులో అదనపు ప్రయోజనం కొనసాగనుంది. గత నెలలోనూ ఎస్‌బీఐ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10–25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం గమనార్హం. ఆర్‌బీఐ ఇప్పటివరకు రెండు విడతల్లో కలిపి అర శాతం మేర రెపో రేటును తగ్గించడంతో ఈ మేరకు డిపాజిట్ రేట్లను బ్యాంక్‌లు సర్దుబాటు చేస్తుండడం గమనార్హం.