వాట్సాప్ యూజర్లను తెగ విసిగిస్తున్న కాల్స్‌, మెసేజ్‌లు!

Whatsapp Users Receiving Pesky Calls SMS - Sakshi

వాట్సాప్ యూజర్లను వ్యాపార సంబంధమైన కాల్స్‌, మెసేజ్‌లు తెగ విసిగిస్తున్నాయట. వాట్సాప్ బిజినెస్ ఖాతాలతో చేసిన సంభాషణలు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కార్యాచరణ ఆధారంగా విసిగించే కాల్స్ లేదా ఎస్ఎంఎస్ ఎక్కువైనట్లు 76 శాతం మంది యూజర్లు పేర్కొన్నట్లు లోకల్ సర్కిల్స్ అనే ఆన్‌లైన్ సర్వే సంస్థ తెలిపింది.  ఫిబ్రవరి 1 నుంచి 20 మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం.. 95 శాతం వాట్సాప్ వినియోగదారులకు ప్రతిరోజూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇబ్బందికరమైన మెసేజ్‌లు వస్తున్నాయి. వీరిలో 41 శాతం మందికి రోజూ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయి. 

వాట్సాప్ బిజినెస్‌ యూజర్లతో సంభాషణ, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కార్యాచరణ ఆధారంగానే వాట్సాప్‌లో ఇలాంటి విసిగించే మెసేజ్‌లు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు 12,215 మంది అదే కారణమని బదులిచ్చారు. దేశంలోని 351 జిల్లాల్లో 51 వేల మంది యూజర్లను ఈ సంస్థ సర్వే చేసింది. ఇటువంటి మెసేజ్‌లకు అడ్డుకట్ట వేయడానికి బ్లాకింగ్‌, ఆర్కైవింగ్ వంటి అందుబాటులో ఉన్న సాధనాలను ఉపయోగిస్తున్నా వాటి అవి ఆగడం లేదు. వాటిని పంపేవారు కూడా నంబర్లు మారుస్తుండటంతోనే ఇలా జరుగుతోందని తెలుస్తోంది. ఇలాంటి అయాచిత వాణిజ్య సందేశాలు రాకుండా మెరుగైన బ్లాకింగ్‌ ఆప్షన్‌ కోసం చూస్తున్నట్లు సర్వేలో పాల్గొన్నవారిలో 73 శాతం మంది పేర్కొన్నారు. 

వాట్సాప్‌ యాజమాన్య సంస్థ మెటా ప్రతినిధి దీనిపై స్పందిస్తూ.. రోజుకు నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే మెసేజ్‌లు  పంపించడానికి తాము వ్యాపార సంస్థలకు అనుమతిస్తామని, యూజర్లు ఇటువంటి మెసేజ్‌లు స్వీకరించడం లేదా మానేయడానికి  చాట్‌లోనే సులభమైన ఆప్షన్‌ను జోడించినట్లు పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: Nandan Nilekani: ఎఎ నెట్‌వర్క్‌తో కోట్ల కొద్దీ ఉద్యోగాలకు ఊతం)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top