రీట్స్‌కు భారీ అవకాశాలు

What Is A Real Estate Investment Trust And How Does It Work - Sakshi

కోల్‌కతా: దేశీయంగా రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(రీట్స్‌)కు భారీ అవకాశాలున్నట్లు పరిశ్రమ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్‌లో ఇతర ఆస్తులలోకి సైతం రీట్‌ నిధులు ప్రవేశించే వీలున్నట్లు అంచనా వేశారు. ఇండస్ట్రియల్, డేటా సెంటర్లు, ఆతిథ్యం, హెల్త్‌కేర్, విద్య తదితర రంగాలోకి రీట్స్‌ విస్తరించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. రియల్టీ రంగంలో ఆదాయాన్ని ఆర్జించే కంపెనీలు రీట్స్‌ జారీ చేసే సంగతి తెలిసిందే. రియల్టీ ఆస్తులలో పెట్టుబడుల ద్వారా స్టాక్‌ ఎక్ఛేంజీలలో లిస్టయ్యే రీట్స్‌ మదుపరులకు డివిడెండ్ల ఆర్జనకు వీలు కల్పిస్తుంటాయి.  

తొలి దశలోనే 
ఇతర ప్రాంతీయ మార్కెట్లతో పోలిస్తే ప్రస్తుతం దేశీయంగా రీట్స్‌ తొలి దశలోనే ఉన్నట్లు కొలియర్స్‌ ఇండియా క్యాపిటల్‌ మార్కెట్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసుల ఎండీ పియూష్‌ గుప్తా పేర్కొన్నారు. అమెరికాసహా ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని సింగపూర్‌ తదితర దేశాలతో పోలిస్తే దేశీ రీట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) 10 శాతానికంటే తక్కువగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే దేశీయంగా కార్యాలయ మార్కెట్‌ పరిమాణంతో చూస్తే భారీ వృద్ధికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. రీట్‌ మార్కెట్‌ అవకాశాలపై ఆశావహంగా ఉన్నట్లు లిస్టెడ్‌ కంపెనీ.. ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ రీట్‌ డిప్యూటీ సీఎఫ్‌వో అభిషేక్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఆఫీస్‌ రీట్‌ మార్కెట్‌ విస్తరణకు చూస్తున్నట్లు తెలియజేశారు.

చెన్నైలో 5 మిలియన్‌ చదరపు అడుగుల(ఎంఎస్‌ఎఫ్‌) కార్యాలయ ఆస్తుల(స్పేస్‌)ను విక్రయించేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర నగరాలలోనూ విస్తరించే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ 35 ఎంఎస్‌ఎఫ్‌ ఆఫీస్‌ స్పేస్‌తో పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 8 ఎంఎస్‌ఎఫ్‌లో బిజినెస్‌ పార్క్‌లను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా 2 ఎంఎస్‌ఎఫ్‌ సిద్ధంకానున్నట్లు వెల్లడించారు.  

డివిడెండ్‌ ఈల్డ్‌ 
దేశీయంగా లిస్టెడ్‌ రీట్స్‌ డివిడెండ్‌ ఈల్డ్‌తోపాటు ఇతర అంశాలపై ఆధారపడి విజయవంతమవుతుంటాయని గుప్తా పేర్కొన్నారు. అంతర్జాతీయ నియంత్రణలకు అనుగుణమైన స్థాయిలో నిబంధనలు రూపొందించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో దేశీయంగా రీట్స్‌ పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఆతిథ్యం, ఆరోగ్య పరిరక్షణ, విద్య తదితర రంగాలకూ విస్తరించవచ్చని అంచనా వేశారు. ఈ బాటలో దేశీయంగా 

తొలిసారి రిటైల్‌ (మాల్స్‌) ఆధారిత నెక్సస్‌ సెలక్ట్‌ ట్రస్ట్‌ రీట్‌ 2023 మే నెలలో లిస్టయినట్లు ప్రస్తావించారు. దేశీయంగా మొత్తం 667 ఎంఎస్‌ఎఫ్‌ ఆఫీస్‌ స్పేస్‌లో 380 ఎంఎస్‌ఎఫ్‌(ఏ గ్రేడ్‌) లిస్టింగ్‌కు అర్హత కలిగి ఉన్నట్లు కొలియర్స్‌ ఇండియా విశ్లేషించింది. ప్రస్తుతం 3 లిస్టెడ్‌ రీట్స్‌ 74.4 ఎంఎస్‌ఎఫ్‌ పోర్ట్‌ఫోలియోతో ఉన్నట్లు తెలియజేసింది. దీనిలో 25 శాతం వాటాతో బెంగళూరు, 19 శాతం వాటాతో హైదరాబాద్‌ తొలి రెండు ర్యాంకుల్లో నిలుస్తున్నట్లు పేర్కొంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top