మార్కెట్లపై రెండింటి ఎఫెక్ట్‌ | this week Indian stock market tracking global cues | Sakshi
Sakshi News home page

మార్కెట్లపై రెండింటి ఎఫెక్ట్‌

May 5 2025 7:46 AM | Updated on May 5 2025 7:47 AM

this week Indian stock market tracking global cues

ఫెడ్ సమావేశం, క్యూ4 ఫలితాలు కీలకం

భారత్, పాక్‌ ఉద్రిక్తతలపై దృష్టి 

దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఈ వారం ట్రెండ్‌ పలు కీలక అంశాలపై ఆధారపడనుంది. దేశీయంగా కార్పొరేట్‌ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి సమీక్షకు తెరతీయనుంది. మరోపక్క భారత్, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ వారం ఆటుపోట్లకు  అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లకు దిక్సూచిగా నిలవగల అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం పాలసీ సమీక్షను ప్రకటించనుంది. రెండు రోజులపాటు సమావేశమయ్యే ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) 7న వడ్డీ రేట్లపై నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే మార్చి నెల సమావేశంమాదిరిగా ఈసారికూడా ఫెడ్‌ యథాతథ రేట్ల అమలుకే కట్టుబడే అవకాశమున్నట్లు అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. గత సమావేశంలో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా.. ఏప్రిల్‌ నెలకు యూఎస్‌ సర్వీసుల పీఎంఐ గణాంకాలు సోమవారం(5న) విడుదలకానున్నాయి. ఇక చైనా ఏప్రిల్‌ వాణిజ్య గణాంకాలు 9న వెల్లడికానున్నాయి. మార్చిలో ఎగుమతుల జోరు కారణంగా 102 బిలియన్‌ డాలర్లకుపైగా వాణిజ్య మిగులు నమోదైంది.

బ్లూచిప్స్‌ ఫలితాలు

ఈ వారం ఆతిథ్య రంగ దిగ్గజం ఇండియన్‌ హోటల్స్, ఆటో దిగ్గజం ఎంఅండ్‌ఎం(5న), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(6న), కోల్‌ ఇండియా, డాబర్‌(7న), మౌలిక దిగ్గజం ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్, బయోకాన్, టైటన్‌(8న), డాక్టర్‌ రెడ్డీస్‌(9న) గత ఆర్థి క సంవత్సరం చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించనున్నాయి. గత వారాంతాన(3న) బ్యాంకింగ్‌ దిగ్గజాలు స్టేట్‌బ్యాంక్, కొటక్‌ మహీంద్రాతోపాటు డీమార్ట్‌ క్యూ4 ఫలితాలు వెల్లడించాయి. ఈ ప్రభావం నేడు(5న) మార్కెట్లలో కనిపించనున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్, రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. కాగా.. హెచ్‌ఎస్‌బీసీ పీఎంఐ సరీ్వసుల డేటా 6న విడుదలకానుంది.

యుద్ధ భయాలు

పహల్గావ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఓవైపు ఆందోళనలు నెలకొన్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా తెలియజేశారు. ఫలితంగా భారత్, పాకిస్తాన్‌ మిలటరీ దళాల ప్రతీ కదలికలనూ కూలంకషంగా పరిశీలించే వీలున్నట్లు వివరించారు. ఫలితంగా మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని లెమన్‌ మార్కెట్స్‌ డెస్క్‌ విశ్లేషకులు గౌరవ్‌ గార్గ్‌ అంచనా వేశారు. సాంకేతికంగా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 24,400 పాయింట్ల వద్ద కీలక అవరోధాన్ని ఎదుర్కొనే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ స్థాయికి ఎగువన నిలిస్తే మరింత బలపడవచ్చని, లేదంటే పరిమిత శ్రేణి కదలికలకే పరిమితంకావచ్చని అంచనా వేశారు. క్యూ1లో యూఎస్‌ జీడీపీ నీరసించడం గ్లోబల్‌స్థాయిలో అనిశ్చితికి దారితీస్తున్నట్లు జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ విశ్లేషించారు. దీంతో ఫెడ్‌ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు.

గత వారమిలా..

గురువారం సెలవు కావడంతో 4 రోజులకే ట్రేడింగ్‌ పరిమితమైన గత వారం.. సెన్సెక్స్‌ 1289 పాయింట్లు(1.6 శాతం) ఎగసి 80,502కు చేరింది. నిఫ్టీ 307 పాయింట్లు(1.3 శాతం) పుంజుకుని 24,347 వద్ద నిలిచింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.4 శాతం బలపడగా.. స్మాల్‌ క్యాప్‌ మాత్రం 1.33 శాతం క్షీణించింది.

ఇదీ చదవండి: న్యూ ఫండ్‌ ఆఫర్లపై ఓ లుక్కేయండి!

ఎఫ్‌పీఐల దన్ను

ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు టారిఫ్‌ల విషయంలో యూఎస్‌తో ఒప్పందం కుదరనున్నట్లు అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. దీంతో గత 12 ట్రేడింగ్‌ సెషన్లలో ఎఫ్‌పీఐలు పెట్టుబడులకే ఆసక్తి చూపుతున్నట్లు జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్‌ తెలియజేశారు. ఫలితంగా యూఎస్‌ డాలరుతో మారకంలో రూపాయి వేగంగా బలపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోపక్క స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలవైపు పరుగు తీస్తున్నట్లు వివరించారు. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 99కు బలహీనపడటం కూడా రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఆరి్థకవేత్తలు పేర్కొన్నారు. దేశీయంగా తొలి మూడు నెలల(జనవరి–మార్చి) తదుపరి ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.4,223 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం!

Advertisement
 
Advertisement
Advertisement