
యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్
వివిధ మార్కెట్ క్యాప్స్‌వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసే మల్టీ క్యాప్ ఫండ్‌ను ప్రకటించింది యూటీఐ మ్యూచువల్ ఫండ్. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మే 13 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్ స్టాక్స్‌లో 3ఎస్ విధానంతో (సైజు, సెక్టార్, స్టయిల్) ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఒక్కో సెగ్మెంట్‌కి కనీసం 25 శాతం మొత్తాన్ని కేటాయిస్తుంది. పటిష్టమైన ఫండమెంటల్స్‌తో టర్న్‌రౌండ్ అవకాశాలు ఉండి ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్‌లో లభించే స్టాక్స్‌లో ఇది ఇన్వెస్ట్ చేస్తుందని యూటీఐ ఏఎంసీ సీఐవో వెట్రి సుబ్రమణియమ్ తెలిపారు. దీనికి కార్తీక్‌రాజ్ లక్ష్మణన్ ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్వాలిటీ ఫండ్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్వాలిటీ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) ఈ నెల 6న మొదలు కానుంది. 20వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్లకు అనుమతి ఉంటుంది. ఈ పథకానికి ప్రామాణిక సూచీగా ‘నిఫ్టీ 200 క్వాలిటీ 30 టీఆర్‌ఐ’ కొనసాగుతుంది. ఇహబ్ దల్వాయ్, మసూమి జుర్మర్‌వాలా ఫండ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. బలమైన ఆర్థిక మూలాలు, పటిష్టమైన నగదు ప్రవాహాలు, రుణ భారం తక్కువగా ఉండి, నిధుల వ్యయాల సామర్థ్యాలు గొప్పగా ఉన్న కంపెనీలను పెట్టుబడులకు ఎంపిక చేస్తుంది. అందుకే పథకానికి క్వాలిటీ అని పేరు పెట్టారు. సుమారు 625 కంపెనీలను జల్లెడ పట్టి అందులో మెరుగైన 40–60 కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంది. భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి సవాళ్లను నాణ్యమైన కంపెనీలు ఎదుర్కొని బలంగా నిలబడగలవని భావిస్తూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఈ పథకాన్ని తీసుకొచి్చంది. పెట్టుబడులను ఏడాదిలోపు విక్రయిస్తే విలువపై ఒక శాతం ఎగ్జిట్ లోడ్ అమలవుతుంది. ఏడాది తర్వాత విక్రయిస్తే ఎగ్జిట్ చార్జీలు ఉండవు.
ఇదీ చదవండి: త్వరలో కేంద్రీకృత కేవైసీ వ్యవస్థ
గ్రో సిల్వర్ ఈటీఎఫ్
వెండిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం గ్రో మ్యూచువల్ ఫండ్ ‘గ్రో సిల్వర్ ఈటీఎఫ్’ ఎన్‌ఎఫ్‌వోను ప్రారంభించింది. ఈ నెల 16 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. అనంతరం మే 30 నాటికి స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో రోజువారీ పెట్టుబడులు, విక్రయాలకు అందుబాటులోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. దేశీ వెండి ధరలకు అనుగుణంగా గ్రో సిల్వర్ ఈటీఎఫ్ ట్రేడవుతుంటుంది. వెండి ధరల గమనానికి అనుగుణంగానే ఇందులో లాభ, నష్టాలు ఆధారపడి ఉంటాయి. భౌతిక వెండి కొనుగోలు, నిల్వ, విక్రయం వంటి సమస్యలను సిల్వర్ ఈటీఎఫ్ తప్పిస్తుంది. ఇందులో కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో రాబడులు కోరుకునే వారికి ఇది అనుకూలమని సంస్థ తెలిపింది. ప్రస్తుతం బంగారం–వెండి నిష్పత్తి 91.64 వద్ద ఉందని.. ఈ ప్రకారం చూస్తే బంగారం కంటే వెండి ధరలే అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది.