
ద వెల్త్ కంపెనీ అస్సెట్ మేనేజ్‌మెంట్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ (పాంటోమ్యాథ్ గ్రూప్ సంస్థ) మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా సెబీ నుంచి తుది ఆమోదం పొందినట్టు ప్రకటించింది. దీంతో రూ.74 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి ‘ద వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్’ పేరుతో అధికారికంగా ప్రవేశించడానికి మార్గం సుగమం అయినట్టు తెలిపింది.
సెబీ నుంచి సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈ నెల 18న మంజూరైనట్టు పేర్కొంది. సాధారణంగా ప్రైవేటు ఈక్విటీ మార్కెట్లో కనిపించే డేటా ఆధారిత పరిశోధన, వినూత్నమైన బోటమ్ అప్ విధానాలను తమ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు అందించనున్నట్టు తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ లాభం జూమ్
ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఏఎంసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 24 శాతం ఎగసి రూ. 748 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 604 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 25 శాతం జంప్‌చేసి రూ. 968 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 775 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ నిర్వహణలోని సగటు ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 6.71 లక్షల కోట్ల నుంచి రూ. 8.3 లక్షల కోట్లకు బలపడింది.