అభివృద్ధి చెందిన భారత్‌ హోదానే లక్ష్యం | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చెందిన భారత్‌ హోదానే లక్ష్యం

Published Thu, Nov 30 2023 4:17 AM

Vision India 2047 document in making for Viksit Bharat - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్‌ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు విజన్‌ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తున్నట్లు నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ విజన్‌ డాక్యుమెంట్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇండస్ట్రీ సంస్థ– ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విజన్‌ డాక్యుమెంట్‌– 2047 భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశిస్తుందని ఆయన అన్నారు.   దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి  విజన్‌ 2047  ప్రధానంగా నిర్దేశించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదే బాటలో రాష్ట్రాలు..
రాష్ట్రాలు కూడా తమ విజన్‌ డాక్యుమెంట్లను అభివృద్ధి చేస్తున్నాయని నీతి ఆయోగ్‌ సీఈవో ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఏడాది మే 2023లో నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, 2047 నాటికి దేశాన్ని వికసించిన భారత్‌గా (అభివృద్ధి చెందిన దేశంగా) మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచి్చన సంగతి తెలిసిందే.

ఈ ప్రక్రియను డిసెంబర్‌ 2021లో క్యాబినెట్‌ సెక్రటరీ ప్రారంభించారు. థీమాటిక్, సెక్టోరల్‌ విజన్‌లను (రంగాల వారీగా) సిద్ధం చేసే బాధ్యతలను  10 సెక్టోరల్‌ గ్రూప్స్‌ ఆఫ్‌ సెక్రటరీలకు అప్పగించడం జరిగింది. పరిశ్రమ ఛాంబర్‌లు, ఎగుమతి ప్రోత్సాహక మండలి, విశ్లేషణా నిపుణులు, పరిశోధనా సంస్థలతో పలు దఫాల్లో మేధోమథనం, సంబంధిత సంప్రదింపులు జరిగాయి. అభివృద్ధి చెందిన భారత్‌  ః2047 కోసం 10 రంగాల దార్శినికత విభాగాలను ఏకీకృతం చేసేందుకు 2023లో నీతి ఆయోగ్‌ బాధ్యతలు చేపట్టింది.  

విద్యకు ప్రాధాన్యత...
కేంద్రం దేశంలో విద్యా ప్రమాణాల పెరుగుదలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఈఓ సుబ్రమణ్యం పేర్కొన్నారు. దేశంలో కాలేజీల నమోదు రేటును 27 శాతం నుంచి 50–60 శాతానికి పెంచాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. ఉన్నత విద్య కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోందని పేర్కొన్న ఆయన,  ఇప్పుడు భారత విద్యా రంగాన్ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.

కాలేజీకి వెళ్లే జనాభా 4 కోట్ల నుండి 8–9 కోట్లకు పెరుగుతుందని ఆయన పేర్కొంటూ,  కాబట్టి మనకు ఈ రోజు ఉన్న వెయ్యి విశ్వవిద్యాలయాలతో పాటు మరో వెయ్యి విశ్వవిద్యాలయాలు అవసరమని విశ్లేషించారు. రాష్ట్రాలు ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతున్నందున, కొత్త విశ్వవిద్యాలయాలను ప్రారంభించడానికి ప్రైవేట్‌ రంగం నుండి నిధులు మరింత రావాల్సి ఉంటుందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. పరిశోధన–అభివృద్ధి– ఆవిష్కరణలే లక్ష్యంగా పనిచేసే బోస్టన్‌– శాన్‌ ఫ్రాన్సిస్కో వంటి విద్యా నగరాలను దేశంలో సృష్టించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

భారతదేశ జనాభాలో సగం మంది సగటు వయస్సు 29 ఏళ్లలోపేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.  ‘‘భారతదేశం జనాభా సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మనకు 25 సంవత్సరాల సుదీర్ఘ అద్భుత సమయం ఉంది’’ అని అన్నారు.  ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామికశక్తిని అందించే దేశంగా భారత్‌ అవతరించబోతోందని పేర్కొన్న సుబ్రహ్మణ్యం, ప్రతి సంవత్సరం 13 లక్షల మంది భారతీయ విద్యార్థులు తమ ఉన్నత విద్యను పూర్తి చేయడానికి భారతదేశం నుండి బయటకు వెళ్తున్నారని చెప్పారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులను భారత్‌కు ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఉద్ఘాటించారు.

తలసరి ఆదాయం 18,000 డాలర్లు లక్ష్యం...
ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్‌ డాలర్లు) కొనసాగుతున్న భారత్‌ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 

2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్‌ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్‌ (4.2 ట్రిలియన్‌ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్‌ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్‌ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు  ఉన్నాయి.   

నేడు రెండో త్రైమాసిక జీడీపీ ఫలితాలు
భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెపె్టంబర్‌) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు గురువారం వెలువడనున్నాయి. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) వృద్ధి 7.8 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి రేటు 7.2 శాతం. కాగా, రెండవ త్రైమాసికంలో మంచి ఫలితాలే నమోదవుతాయన్న విశ్వాసాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ వ్యక్తం చేశారు.

అంతక్రితం ఆయన  ‘పట్టణ మౌలిక రంగం అభివృద్ధి కోసం ప్రైవేట్‌ పెట్టుబడుల వినియోగం– జీ20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ నుండి అనుభవ పాఠాలు’ అనే అంశంపై జరిగిన ఒక జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం. ఇది జీడీపీ నిష్పత్తిలో చూస్తారు) లక్ష్య సాధన సాధ్యమేనని ఆయన అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్‌ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement