ఉడాన్‌ స్కీమ్‌ కోసం 21 ఎంవోయూలు | UDAN Scheme Big Boost 21 New MoUs Signed to Revolutionize Air Travel in India | Sakshi
Sakshi News home page

ఉడాన్‌ స్కీమ్‌ కోసం 21 ఎంవోయూలు

Sep 23 2026 9:06 AM | Updated on Sep 23 2026 9:06 AM

UDAN Scheme Big Boost 21 New MoUs Signed to Revolutionize Air Travel in India

ప్రాంతీయంగా విమానయాన సేవలను మరింతగా పెంచడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందుకోసం ఉడాన్‌ స్కీమ్‌ తదుపరి విడత కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో (యూటీ) ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) 21 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

ఏవియేషన్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం పాటు అంతగా సర్వీసులు లేని ప్రాంతాలకు ఎయిర్‌ కనెక్టివిటీని విస్తరించేందుకు కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమిష్టిగా పని చేసే దిశలో ఇదొక కీలక మైలురాయని ఆయన పేర్కొన్నారు. ఏరోడ్రోమ్‌లను అభివృద్ధి చేసేందుకు చాలెంజ్‌ మోడ్‌ పోర్టల్‌ను, తదుపరి విడత ఉడాన్‌ రూట్ల బిడ్డింగ్‌ కోసం స్కీమ్‌ డాక్యుమెంటును కూడా మంత్రి ఆవిష్కరించారు.   ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) స్కీమును ఏఏఐ అమలు చేస్తోంది.

ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి 687 రూట్లలో సేవలు, 95 ఏరోడ్రోమ్‌లు అందుబాటులోకి వచ్చాయని రామ్మోహన్‌ నాయుడు చెప్పారు. 3.66 లక్షల ఫ్లయిట్లు 1.71 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు వివరించారు. ఏవియేషన్‌ రంగంలో ఉద్యోగాలు 2014లో సుమారు 30 లక్షలు ఉండగా నేడు 77 లక్షలకు చేరాయని వివరించారు. 2040 నాటికి ఈ సంఖ్య 2.5 కోట్లకు చేరొచ్చనే అంచనాలు నెలకొన్నాయని రామ్మోహన్‌ నాయుడు చెప్పారు. సరికొత్తగా తీర్చిదిద్దిన ఉడాన్‌ పథకం కింద కొత్తగా 120 ప్రాంతాలకు సేవలు విస్తరించడం, వచ్చే పదేళ్లలో 4 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం లక్ష్యాలుగా నిర్దేశించుకున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: పెట్రోల్ డీలర్ల సంచలన నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement