
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్ ఇష్యూకి అడ్డుగా నిలుస్తున్న సమస్యలు త్వరలో పరిష్కారంకాగలవని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. కొన్ని అంశాల కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) ఐపీవో ప్రతిపాదన సెబీ వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
కీలక యాజమాన్య వ్యక్తులకు చెల్లించిన పరిహారం, టెక్నాలజీ, క్లియరింగ్ కార్పొరేషన్‌లో మెజారిటీ ఓనర్‌షిప్ తదితరాలకు పరిష్కారం లభించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలనూ తొలగించేందుకు ఎన్‌ఎస్‌ఈ, సెబీ చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అసోచామ్ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో పాండే ఈ విషయాలు వెల్లడించారు. ఇందుకు గడువును ప్రకటించనప్పటికీ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలియజేశారు. ఎన్‌వోసీ కోసం సెబీకి ఎన్‌ఎస్‌ఈ తిరిగి దరఖాస్తు చేసిన నేపథ్యంలో పాండే వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది.