
హైదరాబాద్, చెన్నైలో ఫ్రెషర్స్ నియామకాలు
ప్రథమార్ధంలో 45 శాతం హైరింగ్ అవకాశాలు
ఆర్‌ఎఫ్ ఇంజినీర్లు, నెట్‌వర్క్ సెక్యూరిటీ అనలిస్టులకు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ టెలికం రంగంలో భారీ స్థాయిలో నియామకాలు పెరుగుతున్నాయి. 2025 ప్రథమార్ధంలో కంపెనీలు 45 శాతం మంది ఫ్రెషర్లను తీసుకునే యోచనలో ఉన్నాయి. టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ కెరియర్ ఔట్‌లుక్ నివేదిక (2025 జనవరి–జూన్ ప్రథమార్ధం)లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, టెలికం రంగం వేగంగా 5జీ నెట్‌వర్క్, క్లౌడ్ సిస్టమ్స్ వైపు మళ్లుతూ, సైబర్ సెక్యూరిటీకి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిశ్రమలో ఉద్యోగాల కల్పన గణనీయంగా ఉంటోంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, బెంగళూరులో ఫ్రెషర్ల హైరింగ్ స్థిరంగా కొనసాగుతోంది.
నైపుణ్యాలకు ప్రాధాన్యత
ప్రత్యేక నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్‌ఎఫ్ ఇంజినీర్లు, నెట్‌వర్క్ సెక్యూరిటీ అనలిస్టులు, ఫీల్డ్ టెక్నికల్ ఇంజినీర్లు, జూనియర్ డెవాప్స్ ఇంజినీర్లు, క్లౌడ్ నెట్‌వర్క్ ఇంజినీర్లు మొదలైన వారికి డిమాండ్ ఉంటోంది. హైరింగ్‌పై కంపెనీల ఆసక్తి, గతేడాది ద్వితీయార్థంలో (జులై–డిసెంబర్) నమోదైన 48 శాతం నుంచి స్వల్పంగా కాస్త తగ్గినప్పటికీ నియామకాల జోరు మాత్రం కొనసాగుతోంది. ఆర్‌ఎఫ్ ఇంజినీర్లకు ఢిల్లీ (49 శాతం), అహ్మదాబాద్ (41 శాతం), కోయంబత్తూర్‌లో (35 శాతం) అత్యధికంగా డిమాండ్ నెలకొంది.
నెట్‌వర్క్ సెక్యూరిటీ అనలిస్టులకు బెంగళూరు, ముంబై, నాగ్‌పూర్‌లో వరుసగా 48 శాతం, 43 శాతం, 38 శాతం మేర డిమాండ్ ఉంది. ఇక ఫీల్డ్ టెక్నికల్ ఇంజినీర్లకు హైదరాబాద్ (55 శాతం), కోల్‌కతా (48 శాతం), ఇండోర్‌లో (43 శాతం) ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. జూనియర్ డెవాప్స్ ఇంజినీర్లకు పుణె (44 శాతం), గురుగ్రాం (40 శాతం), కొచి్చలో (35 శాతం) డిమాండ్ ఉంది. అటు క్లౌడ్ నెట్‌వర్క్ ఇంజినీర్లకు చెన్నై (51 శాతం), నాగ్‌పూర్ (45 శాతం), చండీగఢ్‌లో (37 శాతం) అత్యధికంగా నియామక అవకాశాలు నమోదయ్యాయి.
డొమైన్ సర్టిఫికేషన్లు కావాలి..
ఫ్రెషర్లకు టెలికం రంగంలో వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు ఉంటున్నప్పటికీ, నెట్‌వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్‌లాంటి నిర్దిష్ట డొమైన్ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఉంటోంది. ఆర్‌ఎఫ్ వైర్‌లెస్ ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్‌లో సర్టీఫికేషన్లకు డిమాండ్ నెలకొంది. సంక్లిష్టమైన నెట్‌వర్క్ వినియోగాన్ని క్రమబద్ధీకరణ, మేనేజ్‌మెంట్ కార్యకలాపాల నిర్వహణకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్, టాస్క్ ట్రాకింగ్ ప్లాట్‌ఫాంలు లాంటి టెక్నాలజీ టూల్స్ వినియోగం కీలకంగా ఉంటోంది.
ఈ నేపథ్యంలో కేవలం సాంకేతిక నైపుణ్యాలతో సరిపెట్టుకోకుండా, ఉద్యోగార్థులు అనలిటికల్ రీజనింగ్, పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మల్చుకోవడం, ఇంటర్‌పర్సనల్ కమ్యూనికేషన్ సహా సాఫ్ట్ స్కిల్స్‌పై కూడా దృష్టి పెట్టాలని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ వ్యవస్థపకుడు, సీఈవో శంతను రూజ్ తెలిపారు.
‘‘టెలికం పరిశ్రమ వృద్ధి చెందుతున్నప్పటికీ, కంపెనీలు కేవలం కార్యకలాపాల విస్తరణ కోసమే ఉద్యోగులను తీసుకోవడం లేదు. విశిష్టమైన నైపుణ్యాలున్న ప్రతిభావంతులను తీసుకోవడం ద్వారా భవిష్యత్ అవసరాలకు కూడా సర్వసన్నద్ధంగా ఉండాలని భావిస్తున్నాయి. ఆర్‌ఎఫ్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ ఎకోసిస్టమ్స్‌లాంటి అంశాల్లో సర్టిఫికేషన్లు ఉన్న ఫ్రెషర్లు అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రస్తుతం టెలికం విధుల్లో ఐటీ, డేటా కార్యకలాపాలు కూడా కలిసి ఉంటున్నాయి. కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. ఇలా మారిన పరిస్థితులను బట్టి బోధనాంశాలను కూడా సవరించడంపై విద్యా సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగార్థులు కూడా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి’’ అని చెప్పారు.