టాటా మోటార్స్ ఎట్టకేలకు తన సియెర్రా EVను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. ఈ ఎస్‌యూవీ ధరలు రూ.18.79 లక్షల నుంచి రూ.24.79 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు జులై 15 నుంచి మొదలవుతాయని సమాచారం.
కొత్త సియెర్రా ఈవీ.. స్టాండర్డ్ మోడల్ కంటే కొంత భిన్నమైన డిజైన్ పొందుతుంది. ఇందులో బాడీ రంగులో ఉండే క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్, కొన్ని ప్రత్యేకమైన విజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా కొత్త డిజైన్ పొందాయి. కాగా ఇది రిషికేష్ రాపిడ్స్, నైనిటాల్ నాక్టర్న్, ప్రిస్టీన్ వైట్, అండమాన్ అడ్వెంచర్, ప్యూర్ గ్రే, బెంగాల్ రూజ్, కూర్గ్ క్లౌడ్ అనే మల్టిపుల్ కలర్ ఎంపికలలో లభిస్తుంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. దీని లేఅవుట్ సాధారణ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లేతో కూడిన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉండటం చూడవచ్చు.
ఫీచర్స్ జాబితాలో.. వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, అటానమస్ పార్కింగ్ అయిన ఈ-వ్యాలెట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, రియర్ సన్‌బ్లైండ్‌లు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటివన్నీ ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ కారులో స్టాండర్డ్, ఇమ్మర్సివ్, పర్సనల్, స్నో అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. భద్రతా ఫీచర్ల జాబితాలో, ఈ కారు ADAS లెవెల్ 2 ఫీచర్లు, ESP, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 540-డిగ్రీ కెమెరా ఉన్నాయి.
ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్!
టాటా సియెర్రా EV రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తుంది. వీటిలో వెనుక భాగంలో 175 kW మోటార్, ముందు భాగంలో 103 kW మోటార్ ఉన్నాయి. వెనుక మోటార్ 240 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. ముందు మోటార్ 164 Nm టార్క్ అందిస్తుంది. దీని ఫలితంగా మొత్తం 504 Nm గరిష్ట టార్క్ లభిస్తుంది..
ఇది 75 kWh, 63 kWh బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికలలో లభిస్తుంది. 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌పై 665 కి.మీ. రేంజ్ అందిస్తే, 63kWh వెర్షన్ 565 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. రియల్ వరల్డ్ రేంజ్ తగ్గుతుంది. ఈ బ్యాటరీలను 120 kW, 7.2 kW, 3.3 kW ఛార్జర్‌లను ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు.


