విద్యుత్ రంగ దిగ్గజం టాటా పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం 14 శాతం ఎగసి రూ. 1,245 కోట్లను తాకింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,093 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం స్వల్ప(3 శాతం) వృద్ధితో రూ. 15,769 కోట్లను తాకింది. గత క్యూలో రూ. 15,247 కోట్ల టర్నోవర్ అందుకుంది. నిర్వహణ లాభం(ఇబిటా) 6 శాతం మెరుగుపడి రూ. 4,032 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 3,808 కోట్ల ఇబిటా సాధించింది. సొంత అవసరాల కోసం 10 గిగావాట్ల వేఫర్ ఇన్‌గాట్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.
రిలయన్స్ పవర్‌కు లాభాలు
ప్రయివేట్ రంగ విద్యుత్ కంపెనీ రిలయన్స్ పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 87 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 352 కోట్ల నికర నష్టం నమోదైంది.
మొత్తం ఆదాయం సైతం రూ. 1,963 కోట్ల నుంచి రూ. 2,067 కోట్లకు బలపడింది. వృద్ధికి అవసరమైన నిధుల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ పేర్కొంది. మార్పిడికి వీలయ్యే విదేశీ మారక బాండ్ల(ఎఫ్‌సీసీబీలు) జారీ ద్వారా 60 కోట్ల డాలర్లవరకూ సమకూర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది.


