 
													ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 4,774 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 4,015 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 34,721 కోట్ల నుంచి రూ. 38,598 కోట్లకు బలపడింది.
నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ. 9,315 కోట్ల నుంచి రూ. 9,141 కోట్లకు స్వల్పంగా నీరసించింది. నికర వడ్డీ మార్జిన్లు 2.88 శాతం నుంచి 2.52 శాతానికి బలహీనపడ్డాయి. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.73 శాతం నుంచి 2.35 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.98 శాతం నుంచి 0.54 శాతానికి దిగివచ్చాయి.
మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,587 కోట్ల నుంచి రూ. 1,504 కోట్లకు భారీగా తగ్గాయి. ప్రస్తుత స్థాయిలో వృద్ధిని కొనసాగించేందుకు అవసరమైన పెట్టుబడులను కలిగి ఉన్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో కె.సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. దీంతో అదనపు పెట్టుబడుల ఆవశ్యకత లేనట్లు తెలియజేశారు.
యూనియన్ బ్యాంక్ లాభం డౌన్
ప్రభుత్వ రంగ దిగ్గజం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 4,249 కోట్లకు పరిమితమైంది. కీలక వడ్డీ ఆదాయంతోపాటు, రిటెనాఫ్ ఖాతాల నుంచి రికవరీలు తగ్గడం ప్రభావం చూపింది.
నికర వడ్డీ ఆదాయం 3 శాతం నీరసించి రూ. 8,812 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 2.9 శాతం నుంచి 2.67 శాతానికి బలహీనపడ్డాయి. పెట్టుబడుల విక్రయ లాభం 70 శాతం పడిపోయి రూ. 192 కోట్లకు పరిమితంకాగా.. రిటెన్‌ఆఫ్ ఖాతాల నుంచి రికవరీ 36 శాతం క్షీణించి రూ. 913 కోట్లను తాకింది. దీంతో ఇతర ఆదాయం 6 శాతం తక్కువగా రూ. 4,996 కోట్లకు చేరింది.
స్థూల స్లిప్పేజీలు వార్షికంగా రూ. 5,219 కోట్ల నుంచి రూ. 2,151 కోట్లకు భారీగా తగ్గాయి. దీంతో మొత్తం ప్రొవిజన్లు రూ. 3,393 కోట్ల నుంచి రూ. 2,565 కోట్లకు క్షీణించాయి. కనీస మూలధన నిష్పత్తి 17.07 శాతంగా నమోదైంది. ఆదాయంలో వృద్ధిని పెంచుకోవడంతోపాటు.. లాభాలను పరిరక్షించుకోవడంలో సమన్వయం పాటించనున్నట్లు బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోగా ఎంపికైన ఆశీష్ పాండే పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
