
ఈ నెల 10–14 మధ్య ఐపీవో
రూ. 2,516 కోట్ల సమీకరణకు రెడీ
న్యూఢిల్లీ: బీమా రంగ కంపెనీ కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 100–106 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 10న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారు 23.75 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 2,516 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 14న ముగియనున్న ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు 9న షేర్లను ఆఫర్ చేయనుంది. లిస్టింగ్‌లో కంపెనీ విలువ రూ. 10,000 కోట్లుగా నమోదయ్యే వీలుంది.
ఈ భాగస్వామ్య సంస్థలో పీఎస్‌యూ కెనరా బ్యాంక్‌కు 51%, హెచ్‌ఎస్‌బీసీ గ్రూప్ కంపెనీ హెచ్‌ఎస్‌బీసీ ఇన్సూరెన్స్ (ఏషియా పసిఫిక్) హోల్డింగ్స్‌కు 26% చొప్పున వాటా ఉంది. ఐపీవోలో కెనరా బ్యాంక్ 13.77 కోట్ల షేర్లు(14.5 శాతం వాటా), హెచ్‌ఎస్‌బీసీ ఇన్సూరెన్స్ 47.5 లక్షల షేర్లు(0.5 శాతం వాటా)తోపాటు.. ఇన్వెస్టర్ సంస్థ పంజాబ్ నేషనల్‌బ్యాంక్ (పీఎన్‌బీ) 9.5 కోట్ల షేర్లు(10 శాతం వాటా) విక్రయించనున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 140 షేర్లకు (ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ బాటలో ఈ నెల 9న కెనరా రొబెకో అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఐపీవో సైతం ప్రారంభం కానుంది. ఇది 13న ముగియనుంది.