పన్ను మినహాయింపు పిటిషన్‌ తిరస్కరణ | Supreme Court ruled Tiger Global must pay capital gains tax | Sakshi
Sakshi News home page

పన్ను మినహాయింపు పిటిషన్‌ తిరస్కరణ

Jan 16 2026 1:26 PM | Updated on Jan 16 2026 1:38 PM

Supreme Court ruled Tiger Global must pay capital gains tax

టైగర్ గ్లోబల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో తన వాటాల విక్రయం ద్వారా వచ్చిన లాభాలపై పన్ను చెల్లించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ లావాదేవీపై పన్ను మినహాయింపు కోరుతూ అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడి సంస్థ ‘టైగర్ గ్లోబల్’ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పన్ను ఎగవేత ఉద్దేశంతో చేసే లావాదేవీలకు చట్టపరమైన రక్షణ ఉండదని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది.

తీర్పు నేపథ్యం

జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 245ఆర్(2)ను ప్రస్తావిస్తూ.. ఒక లావాదేవీ కేవలం పన్ను ఎగవేత కోసమే రూపొందించబడిందని ప్రాథమికంగా తేలితే ఆ విచారణను అక్కడితోనే నిలిపివేసే అధికారం అధికారులకు ఉంటుందని కోర్టు పేర్కొంది.

వివాదం ఏమిటి?

ఈ వివాదం 2018 నాటి వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందంతో ముడిపడి ఉంది. వాల్‌మార్ట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సమయంలో టైగర్ గ్లోబల్ తన వాటాను సుమారు రూ.14,440 కోట్లకు (1.6 బిలియన్ డాలర్లు)విక్రయించింది. కంపెనీకి వచ్చిన లాభాలపై భారత్–మారిషస్ మధ్య ఉన్న ‘డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్’ (DTAA) ప్రకారం తమకు పన్ను మినహాయింపు ఉంటుందని టైగర్ గ్లోబల్ వాదించింది. ఈ కంపెనీ పన్ను తప్పించుకోవడానికి సృష్టించిన మధ్యవర్తి సంస్థేనని, దీని అసలు నియంత్రణ అమెరికాలోని మాతృ సంస్థ చేతిలోనే ఉందని భారత పన్ను అధికారులు వాదించారు.

ఢిల్లీ హైకోర్టు తీర్పు

గతంలో (ఆగస్టు 2024లో) ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు టైగర్ గ్లోబల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. మారిషస్ జారీ చేసిన ‘ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ (TRC)’ ఉంటే పన్ను మినహాయింపునకు అది సరిపోతుందని పేర్కొంది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. కేవలం టీఆర్‌సీ ఉంటే సరిపోదని, సదరు సంస్థలకు స్వతంత్ర వాణిజ్య అస్తిత్వం ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘విక్రయించిన షేర్ల ద్వారా భారతదేశంలోని ఆస్తుల నుంచి లబ్ధి పొందినప్పుడు అవి భారతీయ కంపెనీకి చెందినవి కావు అనే సాకుతో పన్ను నుంచి తప్పించుకోలేరు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఇన్వెస్టర్లపై ప్రభావం

ఈ తీర్పు విదేశీ పెట్టుబడిదారులకు ఎదురుదెబ్బగా నిపుణులు భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు పన్ను ఒప్పందాలపై పెట్టుకున్న నమ్మకం సడలుతుందని అభిప్రాయపడుతున్నారు. దాంతో ఇకపై పెట్టుబడిదారులు తమ లాభాల్లో పన్ను ఖర్చులను కూడా ముందుగానే లెక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం కాగితాలపై కంపెనీలను చూపడం కాకుండా, క్షేత్రస్థాయిలో ఆ కంపెనీల కార్యకలాపాలు ఎలా ఉన్నాయనేది ఇకపై కీలకం కానుంది.

ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement