డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్కామ్‌.. నిందితులకు బెయిల్‌ రద్దు చేసిన సుప్రీంకోర్టు | Supreme Court Cancelled The Bail Granted To DHFL Ex Promoters In Bank Loan Fraud Case, Details Inside - Sakshi
Sakshi News home page

DHFL Bank Loan Scam: నిందితులకు బెయిల్‌ రద్దు చేసిన సుప్రీంకోర్టు

Published Wed, Jan 24 2024 11:58 AM

Supreme Court Cancels Bail To DHFL Ex Promoters Bank Fraud Case - Sakshi

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్), దాని మాజీ ప్రమోటర్లు కపిల్‌ వాధ్వాన్‌, దీరజ్‌ వాధ్వాన్‌పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. యూనియన్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని కన్షార్షియాన్ని రూ.34,615 కోట్ల మేర డీహెచ్‌ఎఫ్‌ఎల్ మోసగించిందన్న అభియోగాలపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. 

ఈ కేసుకు సంబంధించి కపిల్, ధీరజ్‌లకు దిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. నిందితులకు బెయిల్ మంజూరు చేయడంలో హైకోర్టు, ట్రయల్ కోర్టు ఇంకాస్త మెరుగ్గా స్పందించాల్సిందని సుప్రీంకోర్టు తెలిపింది. 

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ లోన్ స్కామ్‌కు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సీఆర్‌పీసీ ప్రకారం 90 రోజుల దర్యాప్తు గడువులోపు క్రిమినల్ కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడంలో విఫలమైతే నిందితులకు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 88వ రోజు సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయగా, ట్రయల్ కోర్టు నిందితులకు కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. దాన్ని సవాలుచేస్తూ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈతీర్పు వెలువడినట్లు తెలిసింది. 

అసలేం జరిగిందంటే..

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మోసాలు 2019 జనవరి నుంచి వెలుగులోకి రావడం మొదలైంది. ఈ సంస్థ నిధులు మళ్లిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై ‘ప్రత్యేక ఆడిట్‌’ నిర్వహించాలంటూ కేపీఎమ్‌జీ సంస్థను 2019 ఫిబ్రవరి 1న బ్యాంకులు నియమించాయి. 2015 ఏప్రిల్‌ 1-2018 డిసెంబరు మధ్యకాలానికి, ఆ సంస్థ ఖాతా పుస్తకాలపై సమీక్ష నిర్వహించాలని కేపీఎమ్‌జీని అప్పట్లో కోరాయి. కపిల్‌, ధీరజ్‌ వాధ్వాన్‌లు దేశం విడిచిపెట్టకుండా ఉండేందుకు 2019 అక్టోబరు 18న ‘లుక్‌అవుట్‌ సర్క్యులర్‌’లను బ్యాంకులు  జారీ చేశాయి.

కేపీఎమ్‌జీ నిర్వహించిన ఆడిట్‌లో.. రుణాలు, అడ్వాన్సులు పొందిన తర్వాత డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన సంస్థలు, వ్యక్తులు, డైరెక్టర్ల ఖాతాలకు నిధుల మళ్లింపు జరిగిందని తేలినట్లు యూనియన్‌ బ్యాంకు పేర్కొంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లకు రూ.29,100 కోట్ల మేర పంపిణీ జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో చాలా వరకు లావాదేవీలు భూములు, ఆస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టినట్లు బ్యాంకు ఖాతా పుస్తకాల పరిశీలనలో తేలినట్లు వివరించింది. రుణాలిచ్చిన నెలరోజుల్లోనే ఆ నిధులు సుధాకర్‌ షెట్టికి చెందిన కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లినట్లు తేలింది. రూ.వందల కోట్ల  చెల్లింపులకు సంబంధించిన వివరాలు బ్యాంకు స్టేట్‌మెంట్లలో కనిపించలేదు. రుణాల అసలు, వడ్డీలపై సహేతుకం కాని రీతిలో మారటోరియం కనిపించింది. పలు సందర్భాల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, తన ప్రమోటర్లకు భారీ ఎత్తున నిధులను పంపిణీ చేసింది. వాటిని తమ ఖాతా పుస్తకాల్లో రిటైల్‌ రుణాలుగా పేర్కొన్నారు.

రూ.14,000 కోట్ల గల్లంతు

ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ కింద రూ.14,000 కోట్లు ఇచ్చినట్లు చూపారు. ఇందు కోసం 1,81,664 మందికి రిటైల్‌ రుణాలు ఇచ్చినట్లు తప్పుగా సృష్టించారు. ఇవ్వని రుణాల విలువ రూ.14,095 కోట్లుగా తేలింది. తరుచుగా.. ‘బాంద్రా బుక్స్‌’ పేరిట రుణాలను పేర్కొంటూ, వాటికి విడిగా డేటాబేస్‌ నిర్వహించారు. ఆ తర్వాత వాటన్నింటినీ ‘అదర్‌ లార్జ్‌ ప్రాజెక్ట్‌ లోన్స్‌’(ఓఎల్‌పీఎల్‌)లో విలీనం చేశారు. కాగా, కంపెనీకి చెందిన గృహ రుణాలు, ప్రాజెక్టు రుణాల హామీలు, ప్రమోటర్ల వాటా అమ్మకం తదితరాల ద్వారా కంపెనీపై ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎప్పటికప్పుడు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఆ కంపెనీ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు చెబుతూ వచ్చారు.

ఇదీ చదవండి: సేవింగ్స్‌ ఖాతాలపై 7.75 శాతం వడ్డీ కావాలా..!

2019 మే నుంచి రుణాల చెల్లింపులు, వడ్డీలను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నిరర్థక ఆస్తులుగా కంపెనీ ఖాతాలను ప్రకటించారు. దాంతో బ్యాంకులపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా రూ.34,615 కోట్ల మోసానికి పాల్పడినట్లు తేలింది. ఎఫ్‌ఐఆర్‌లో మాజీ ప్రమోటర్లతోపాటు అమిలిస్‌ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్‌ షెట్టి, మరో ఎనిమిది మంది బిల్డర్లు కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement