క్రేజీ ఆలోచనలతోనే సరిహద్దుల్లేని విజయాలు | Sundar Pichai Secret to Limitless Success Crazy Ideas Changed Tech Forever | Sakshi
Sakshi News home page

క్రేజీ ఆలోచనలతోనే సరిహద్దుల్లేని విజయాలు

Jun 29 2026 1:26 PM | Updated on Jun 29 2026 2:18 PM

Sundar Pichai Secret to Limitless Success Crazy Ideas Changed Tech Forever

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అసాధారణ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. గూగుల్‌లో పిచాయ్‌తో కలిసి పనిచేసిన అగ్రశ్రేణి టెక్ నిపుణులు, ‘రూబ్రిక్’, ‘గ్లీన్’ సంస్థల సహ వ్యవస్థాపకుడు అరవింద్ జైన్ ఇటీవల ఫార్చ్యూన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రపంచం వెర్రి ఆలోచన అని కొట్టిపారేసిన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్ట్‌ను పిచాయ్ ఎలా విజయతీరాలకు చేర్చారో, ఆయన పనితీరు నుంచి తాను నేర్చుకున్న పాఠాలేమిటో జైన్ వివరించారు.

భారతదేశంలోని ఒక చిన్న పట్టణం నుంచి అమెరికాకు వెళ్లిన అరవింద్ జైన్ ప్రారంభంలో గూగుల్‌లో చేరినప్పుడు తీవ్రమైన ఆత్మన్యూనతా భావానికి లోనైనట్లు అంగీకరించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన అత్యంత నిపుణులైన సహోద్యోగుల మధ్య తానొక ‘మోసగాడిలా’ (అర్హత లేకపోయినా వచ్చినట్లు) భావించానని చెప్పారు. అయితే, ఆ ప్రతిభావంతుల మధ్య కొందరు మాత్రమే ఎందుకు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటున్నారనే విషయాన్ని ఆయన గమనించడం ప్రారంభించారు. అలా ఆయన దృష్టిని ఆకర్షించిన అగ్రగామి నాయకుడే సుందర్ పిచాయ్.

‘నేను, సుందర్‌ గూగుల్‌లో చాలా కాలం కలిసి పని చేశాం.  కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగిగా చేరినప్పటి నుంచి సుందర్‌ నాకు తెలుసు. గూగుల్‌లో బెస్ట్ స్కూల్స్ నుంచి వచ్చిన ఎందరో మేధావులు ఉన్నా వారందరూ ఉన్నతంగా రాణించలేకపోయారు. అప్పుడే అసలు విజయ సూత్రం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. చాలా కాలం కిందట ఆన్‌లైన్‌ బ్రౌజర్ల విభాగం పూర్తిగా మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యంలో ఉండేది. అప్పటికే నెట్‌స్కేప్ వంటి దిగ్గజాలు విఫలమవడంతో గూగుల్ క్రోమ్ ప్రాజెక్టుపై పెద్దగా నమ్మకం లేదు. దాంతో నేను కూడా ఇది చాలా చెడ్డ ఆలోచన అని భావించాను. ఎందుకంటే నేను అంత లోతుగా ఆలోచించలేకపోయాను’ అని జైన్ పేర్కొన్నారు.

అప్పట్లో మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ బాల్మర్ సైతం క్రోమ్‌ను ఒక సాధారణ ‘రౌండింగ్ ఎర్రర్’ (లెక్కలోకి తీసుకోనవసరం లేని పొరపాటు) అని బహిరంగంగా కొట్టిపారేశారు. అందరూ అసాధ్యం అనుకున్నచోటే పిచాయ్ తన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో క్రోమ్‌ను ముందుకు నడిపారు. ఫలితంగా 2012 నాటికి క్రోమ్ ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా ఉపయోగించే బ్రౌజర్‌గా అవతరించి ప్రత్యర్థులను వెనక్కి నెట్టింది. ఈ విజయమే ఆగస్టు 2015లో పిచాయ్ గూగుల్ సీఈఓగా ఎదగడానికి బలమైన పునాది వేసింది.

పిచాయ్ విజయ సూత్రాలు

అరవింద్ జైన్ విశ్లేషణ ప్రకారం, సుందర్ పిచాయ్ శైలి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఇవే..

  • కేవలం కష్టపడి పనిచేయడం మాత్రమే సరిపోదు, లక్ష్యం పట్ల విపరీతమైన పట్టుదల ఉండాలి.

  • గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌ల తరహాలోనే పిచాయ్ మనసులో సాధ్యసాధ్యాలపై ఎలాంటి పరిమితులు లేవు.

  • ప్రతి ఒక్కరూ తెలివితక్కువది, బహుశా వాస్తవాలకు దూరంగా ఉందని భావించే పనిని మనం చేయబోతున్నాం అని నమ్మినప్పుడే మ్యాజిక్ జరుగుతుంది.

రూబ్రిక్, గ్లీన్ సంస్థలతో జైన్ సంచలనాలు

సుందర్ పిచాయ్ నుంచి నేర్చుకున్న ఈ క్రేజీ థాట్స్‌ పాఠాలే అరవింద్ జైన్‌ను తదుపరి కాలంలో ఒక విజయవంతమైన బిలియనీర్‌గా మార్చాయి. తాను గూగుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జైన్ స్థాపించిన క్లౌడ్ డేటా మేనేజ్‌మెంట్ కంపెనీ రూబ్రిక్, 2024లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సుమారు 5.6 బిలియన్‌ డాలర్లతో లిస్ట్ అయింది. అనంతరం ఆయన ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'గ్లీన్' ప్రస్తుతం 7.2 బిలియన్‌ డాలర్ల విలువైన కంపెనీగా దూసుకుపోతోంది.

జెన్-జీ నుంచి నిరంతర అభ్యాసం

ప్రస్తుతం ఇంతటి అంతర్జాతీయ స్థాయి విజయాన్ని అందుకున్నప్పటికీ జైన్ తన సంస్థల్లోని యువతరం(జెన్‌ జీ) నుంచి నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపారు. యువత సరికొత్త దృక్పథాలను, వినూత్న ఆలోచనలను తీసుకువస్తుందని, నేటి వేగవంతమైన టెక్ ప్రపంచంలో అప్‌డేట్‌గా ఉండటానికి వారి ఆలోచనలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement