
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు ఆయన పేరు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ట్రంప్ పేరుతో గూగుల్‌లో సెర్చ్(Google search) చేస్తే ఆయనకు సంబంధించి తాజా వార్తావిశేషాలు, తాను తీసుకున్న నిర్ణయాలు, తన పర్యటనలు... ఇలా విభిన్న సమాచారం ప్రత్యక్షం అవుతుంది. అయితే గూగుల్ ఇమేజెస్‌లో ఇటీవల ‘ఇడియట్’ అని సెర్చ్ చేస్తున్న వ్యూయర్లకు కూడా ట్రంప్ ఫొటోనే దర్శనమివ్వడం పట్ల తీవ్ర దుమారం రేగింది. దాంతో అమెరికా ప్రభుత్వం స్పందించి ఈ వ్యవహారంపై జ్యుడీషియరీ కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవల ఆ కమిటీ ముందు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) అలా జరగడానికి కారణాలేంటో వివరించారు.
ఇటీవల యూఎస్ హౌస్ జ్యుడీషియరీ కమిటీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను గూగుల్ ఇమేజెస్‌లో ‘ఇడియట్’ అనే పదాన్ని సెర్చ్ చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చిత్రాలను ఎందుకు చూపించారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా గూగుల్ సెర్చ్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తుందో వివరించారు. ‘మేము కీవర్డ్ తీసుకుంటాం. మా ఇండెక్స్‌లోని బిలియన్లలో ఉన్న పేజీలతో సరిపోలుస్తాం. ఆ సమయంలో ఆ కీవర్డ్‌కు సంబంధించిన, తాజాగా ఉన్న, ప్రజాదరణ పొందిన సమాచారాన్ని యూజర్లకు అందిస్తాం. ఇది పూర్తిగా ఇతర వ్యక్తులు సెర్చ్ చేస్తున్నదానిపై ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా వాటిని ర్యాంక్ చేస్తాం’ అన్నారు.
గూగుల్ బాంబింగ్
‘ఈ విధానాన్ని ‘గూగుల్ బాంబింగ్’ అని పిలుస్తారు. ఇది ఒక నిర్దిష్ట పదాన్ని నిర్దిష్ట పేజీకి లింక్ చేయడం వంటి ఆన్‌లైన్ సమన్వయ సెర్చ్ ఫలితాలను ప్రభావితం చేస్తుంది. గూగుల్ మాన్యువల్‌గా ఫలితాలను తారుమారు చేయదు. రాజకీయ పక్షపాతం వహించదు. ఈ అల్గోరిథమ్‌లు వినియోగదారుల ప్రవర్తన, ఇంటర్నెట్ ట్రెండ్స్‌ను ప్రతిబింబిస్తాయి’ అని పిచాయ్ నొక్కి చెప్పారు. ‘ఇది కొన్నిసార్లు ఊహించని లేదా వివాదాస్పద ఫలితాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!?